రైనా విజయం వెనుక ఎవరున్నారో తెలుసా?
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని చెప్తారు. అదేవిధంగా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తన విజయం వెనుక ఓ మహిళ ఉందని చెప్తున్నాడు టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా. ఇప్పటివరకు ఐపీఎల్‌లో మహేంద్రసింగ్ ధోనీ నీడలో ఒదిగిపోయాడు రైనా. గత ఎనిమిది ఐపీఎల్ సరీస్‌లోనూ సారథి ధోనీ చెప్పిన మాట వింటూ.. జట్టు అవసరాలకు ఆదుకుంటూ, పెద్దగా వెలుగులోకి రాకుండా, పెద్దగా మెరుపులు మెరిపించకుండానే బండి లాక్కొచ్చాడు రైనా.
కానీ, తాజా ఐపీఎల్‌లో రైనాను సరికొత్త బాధ్యతలు వరించాయి. రాజ్‌కోట్‌కు చెందిన కొత్త ఐపీఎల్ జట్టు గుజరాత్ లయన్స్‌కు సారథిగా రైనా పగ్గాలు చేపట్టాడు. కొత్త జట్టు అయినప్పటికీ విజయవంతంగా నడిపిస్తూ వరుస విజయాలు సాధిస్తూ సారథిగా తనను తాను నిరూపించుకుంటున్నాడు రైనా. ఐపీఎల్ 9వ సీరిస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ నాలుగు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఐపీఎల్ రైనా కెప్టెన్సీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. డ్వేన్ బ్వేవో, న్యూజిల్యాండ్ మాజీ కెప్టెన్ బ్రండన్ మెక్కలమ్ రైనా సారథ్యాన్ని కొనియాడారు. 'ఒత్తిడిలోనూ దృఢచిత్తంతో శాంతంగా కనిపిస్తున్నాడు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు' అంటూ మెక్కలమ్ రైనాను పొగడ్తల్లో ముంచెత్తాడు.
తనలో ఈ మార్పునకు కారణమేమిటంటే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.. తన భార్య ప్రియాంకకు ఆ క్రెడిట్ కట్టబెడుతున్నాడు రైనా. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తన విజయం వెనుక తన సతీమణి ఉందని చెప్తున్నాడు. 'నా పెళ్లి తర్వాత నేను చాలా మెరుగయ్యాను. శాంతంగా, బాధ్యతాయుతంగా ఉండటం నేర్చుకున్నాను' అని రైనా ఐపీఎల్‌టీ20.కామ్‌కు తెలిపాడు. గత ఏడాది ఏప్రిల్‌లో తన బాల్య స్నేహితురాలు ప్రియాంకను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు రైనా. ఇప్పటివరకు వరుసగా ఐపీఎల్ సిరీస్‌లన్నింటిలోనూ ఆడుతూ వస్తున్న రైనా ఈసారి కొన్ని మ్యాచ్‌లు మిస్సయ్యే అవకాశముంది. నెదర్లాండ్స్‌లో తన భార్య తమ మొదటి బిడ్డను ప్రసవించనున్న నేపథ్యంలో రైనా అక్కడి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.