సాక్షి, హైదరాబాద్: సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్) ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నీ జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలపడమే లక్ష్యంగా తమ సొసైటీ కృషి చేస్తోందని టీసీఎస్ అధ్యక్షుడు బండ మాధవ రెడ్డి వెల్లడించారు. సింగపూర్‌లోని స్పోర్టిస్ వుడే కోర్టు ల్లో ఈ పోటీలను నిర్వహించారు. మాతృభూమికి దూరంగా వున్న తెలంగాణ వాసులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు టీసీఎస్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తెలంగాణ పండగల విశేషాలతో పాటు... క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఈ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించామన్నారు. సుమారు వంద మందికి పైగా తెలంగాణ క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్ విజేతలకు మాధవ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్, ఉపాధ్యక్షులు బూర్ల శ్రీనివాస్, పెద్ద చంద్రశేఖర్‌రెడ్డి, ముదాం అశోక్ పాల్గొన్నారు. గరేపల్లి శ్రీనివాస్, ఆర్‌సీ రెడ్డి, లక్ష్మారెడ్డి, దుర్గాప్రసాద్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.