
టీమిండియా ఆలౌట్.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్
మొహాలి: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు.. మూడో రోజు లంచ్ విరామం తర్వాత టీమిండియా ఆలౌట్ అయింది. టీమిండియా అన్ని వికెట్లను కోల్పోయి 200 పరుగులు చేసింది. చివరగా ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతికి సాహ వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా 217 పరుగుల ఆధిక్యం నమోదుచేసుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 125 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన పుజారా, కొహ్లీ మూడో రోజు ఆటను దూకుడుగా ప్రారంభించారు. ఓవర్ నైట్ స్కోర్ కు 31 పరుగులు జోడించి.. భారీ లీడ్ దిశగా సాగుతున్నట్లు కనిపించారు.
ఈ దశలో వరసగా బౌండరీలు బాది జోరుమీదున్న కెప్టెన్ కొహ్లీ(29)ని వాన్ జిల్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత మూడు పరుగులకే పుజారా(77)ను తాహిర్ ఔట్ చేశాడు. మరుసటి ఓవర్ లోనే రెహానే ఔట్ కావడంతో.. టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ జడేజా, మిశ్రా, అశ్విన్ లు వెంట వెంటనే ఔట్ కావడంతో.. ఓ దశలో 160/3 తో పటిష్టంగా కనిపించిన భారత్ లంచ్ విరామానికి 8 వికెట్లకు 185 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం మరి కాసేపటికే 200 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రొటీస్ బౌలర్లు హార్మర్ 4, ఇమ్రాన్ తాహిర్ చెరో4 వికెట్లు కూల్చగా.. ఫిలాండర్, వాన్ జిల్ చెరోక వికెట్ పడగొట్టారు. దీంతో దక్షిణాఫ్రికా తిరిగి బ్యాటింగ్ ప్రారంభించి రెండో ఓవర్లోనే తొలి వికెట్ సమర్పించుకుంది. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్, ఎల్గార్ ఉన్నారు.