క్రికెట్ నుంచి తప్పుకోవాలన్నారు: ఇర్ఫాన్ పఠాన్
టీమిండియా ఆల్ రౌండర్, బరోడా పేసర్ ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2017 సీజన్ వేలంలో తనను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపక పోవడంపై బాధతో స్పందించాడు. 2007లో ట్వంటీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో ఇర్ఫాన్ కీలక ఆటగాడు. భారత జట్టులోకి రావడానికి తాను ఎంత కష్టపడ్డాడో, ఎంతో తీవ్రమైన సమస్యలను తాను ఎలా అధిగమించాడో ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఓ లేఖ పోస్ట్ చేశాడు.
'2010లో ఐదు ఫ్రాక్చర్స్ అయితే క్రికెట్ ఇక జీవితంలో క్రికెట్ ఆడలేవని ఫిజియో, ట్రైనర్ నాకు చెప్పారు. వీలైనంత ఎక్కువ కాలం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడమే నా డ్రీమ్. అలాంటిది ఫిజియో మాటలకు ఎంతో కలవరపడ్డాను. ఎంత నొప్పి, బాధనైనా భరిస్తాను.. కానీ టీమిండియాకు ఆడకుండా ఉండలేనని ఫిజియోను తేల్చి చెప్పేశాను. క్రికెట్ మళ్లీ ఆడేందుకు మాత్రమే కష్టపడలేదు. భారత జట్టులో మళ్లీ అవకాశం కోసమే కెరీర్లో, జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
ప్రస్తుతం నా ముందు మరో సమస్య (ఐపీఎల్-10) ఉంది. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశలను వదులుకోలేను. ఈ సమస్య నుంచి నేను బయటపడాలని చాలా మంది క్రికెటర్లు నాకు మద్దతుగా నిలిచారు' అని తన అభిమానులకు తెలియజేస్తూ పోస్ట్ లో ఇర్ఫాన్ పఠాన్ రాసుకొచ్చాడు. భారత జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఇర్ఫాన్ దేశవాలీ టోర్నీల్లో సత్తాచాటుతున్న విషయం తెలిసిందే. ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే ఇర్ఫాన్ ను ఏ ఫ్రాంచైజీ అయినా తీసుకునే అవకాశం ఉంది.
To all my fans