
తీరు మారని టీమిండియా
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్, వన్డే సిరీస్ ల లో పేలవమైన ఆటను కొనసాగించి వరుస సిరీస్ లను కోల్పోయిన టీమిండియా.. టెస్టుల్లో కూడా అదే ఆట తీరును కొనసాగిస్తోంది. నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇక్కడ గురువారం ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకే ఆలౌటయ్యింది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(75) మినహా ఎవరూ హాఫ్ సెంచరీ మార్కును చేరలేదు. ఆదిలోనే శిఖర్ ధవన్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరగా, ఆ తరువాత చటేశ్వర పూజారా(31), కెప్టెన్ విరాట్ కోహ్లి(1), అజింక్యా రహానే(15), సాహా(0)లు వరుసగా విఫలమయ్యారు.
కాగా, చివర్లో అజయ్ జడేజా(38), రవి చంద్రన్ అశ్విన్(20) కాసేపు దక్షిణాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించారు. అయితే జట్టు స్కోరు 196 పరుగుల వద్ద జడేజా ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరడంతో మిగతా రెండు వికెట్లు ఐదు పరుగుల వ్యవధిలో నేలకూలాయి. టీమిండియా జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎల్గర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా, ఇమ్రాన్ తాహీర్, ఫిలిందర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.