
దక్షిణాఫ్రికాలో పేస్‌ను ఎదుర్కొన్నాం... ఇంగ్లండ్‌లో స్వింగ్‌ను చూశాం... ఆస్ట్రేలియాలో బౌన్స్‌ను తట్టుకున్నాం... మరి న్యూజిలాండ్‌లో...? చెప్పాలంటే పై మూడూ కలపాలి. ఇప్పటికీ ప్రత్యర్థి బలం కంటే పిచ్‌లే ఎక్కువ ఆందోళన కలిగించే దేశమేదంటే అది న్యూజిలాండే. అందుకే ఎంత బలమైన జట్టుకైనా అక్కడ ఆడటం కఠిన సవాల్ వంటిది. విపరీతమైన స్వింగ్‌కు తోడు, గాలులతో కూడిన చల్లటి వాతావరణంలో మచ్చికైన పచ్చిక పిచ్‌లపై ఆతిథ్య పేసర్లను ఆడటం దిగ్గజ బ్యాట్స్‌మెన్‌కు సైతం పరీక్షే. ఈ నేపథ్యంలో కోహ్లి సేన ఎంతమేరకు రాణిస్తుందో?
సాక్షి క్రీడా విభాగం :నలభై మూడేళ్ల చరిత్రలో ఏడు సిరీస్‌లు ఆడితే ఒక్క దాంట్లోనే గెలుపు! 34 మ్యాచ్‌ల్లో పదింట్లోనే విజయం! ఇందులో మూడు విజయాలు ఒక్క సిరీస్ (2009)లో వచ్చినవే! గత పర్యటన (2014)లో ఐతే 0–4తో భారీ పరాభవం. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా వన్డే రికార్డు ఎంత పేలవంగా ఉందో ఈ గణాంకాలను చూస్తే తెలిసిపోతుంది. బుధవారం నుంచి ఐదు వన్డేల సిరీస్ సమరానికి సిద్ధమవుతున్న కోహ్లి సేన... అంచనాలకు మించి ఆడితేనే మెరుగైన ఫలితం రాబట్టే వీలుంటుంది. అటువైపు నిలకడకు మారుపేరైన కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ కూడా తక్కువగా ఏమీ లేదు. రెండేళ్లుగా చూస్తే వన్డే విజయాల శాతంలో ఇంగ్లండ్ (72.73), భారత్ (71.15) తర్వాతి స్థానం (61.11) దానిదే. రాస్ టేలర్, టామ్ లాథమ్, నికోల్స్ వంటి బ్యాట్స్‌మెన్‌తో... బౌల్ట్, సౌథీ, బ్రాస్‌వెల్ వంటి పేసర్లతో ఇటీవల మరింత బలంగా తయారైంది.
ఓపెనర్లు... పేసర్లు...
జట్టులో మిగతావారి సంగతెలా ఉన్నా, కివీస్ టూర్ ఈసారి ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్, పేసర్లు షమీ, భువనేశ్వర్‌లకు వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకమైనది. 2014 పర్యటనలో ఈ నలుగురూ విఫలమయ్యారు. ఐదు మ్యాచ్‌ల్లో రోహిత్ ఒక్కటే అర్ధ సెంచరీ సాధించగా, ధావన్ అదీ చేయలేకపోయాడు. నాటితో పోలిస్తే వీరి ఆట మెరుగైంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్‌లోనూ మెరిస్తే ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ కప్ ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసం వస్తుంది. పేసర్లలో నాడు షమీ భారీగా పరుగులిచ్చి వికెట్లు పడగొట్టగా, భువీ ప్రభావం చూపలేకపోయాడు. నేడూ వీరే ప్రధాన బౌలర్లుగా జట్టు బరిలో దిగనుంది. ఈ ఐదేళ్లలో మంచి అనుభవం కూడగట్టుకుని బౌలింగ్‌లోనూ రాటుదేలిన ఈ ఇద్దరూ ఏం చేస్తారో చూడాలి. కెప్టెన్ కోహ్లి, ధోని గత పర్యటనలో బాగానే ఆడారు. వీరికి దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు అండగా నిలిస్తే జట్టుకు విజయావకాశాలుంటాయి. స్పిన్ ఆలౌండర్ రవీంద్ర జడేజా 2014లో అసాధారణ ఇన్నింగ్స్‌తో ఓ మ్యాచ్‌ను కాపాడాడు. ఇప్పుడు కుల్దీప్, చహల్ తోడుగా అతడు తన పాత్ర పోషించాల్సి ఉంది.
కివీస్ ఎలా ఉందంటే?
సొంతగడ్డపై ఏ జట్టయినా కొంత బలంగానే ఉంటుంది. వాతావరణ పరిస్థితులరీత్యా న్యూజిలాండ్ ఈ విషయంలో ఇంకాస్త బలమైనదని చెప్పొచ్చు. ఎలాంటి పిచ్‌పైనైనా పరుగులు సాధించే విలియమ్సన్ ఆ జట్టుకు పెద్ద ఆస్తి. విధ్వంసక ఓపెనర్లు గప్టిల్, మున్రో, మిడిలార్డర్‌లో రాస్ టేలర్, లోయరార్డర్‌లో గ్రాండ్‌హోమ్ వంటి ఆల్‌రౌండర్‌తో బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. డిసెంబరులో తటస్థ వేదిక అబుదాబిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కివీస్ ప్రస్తుత ఫామ్‌ను చెబుతోంది. తాజాగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఆ జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గెలిచేసింది. అన్నింటికి మించి స్వదేశంలో పేసర్లు బౌల్ట్, సౌథీలను ఎదుర్కోవడం కత్తి మీద సాము. ఎడంచేతి వాటం బౌల్ట్ మరింత ప్రమాదకారి. బ్యాటింగ్‌లో విలియమ్సన్, టేలర్‌లను ఎంతమేరకు కట్టడి చేస్తారనే దాని పైనే సిరీస్‌లో భారత గెలుపు ఆధారపడి ఉంటుంది.