కావాలొక ఫినిషర్‌! | Team india searching for Quality all-rounder | Sakshi
Sakshi News home page

కావాలొక ఫినిషర్‌!

Published Thu, Sep 13 2018 1:05 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

Team india searching for Quality all-rounder  - Sakshi

‘ఫలితం 1–3గా కనిపిస్తూ మేం సిరీస్‌ కోల్పోయి ఉండొచ్చు. కానీ, ఈ గణాంకాలు టీమిండియా 3–1తో గెలవాల్సిందని, లేదా 2–2తో సమం కావాల్సిందని చెప్పలేవు. జట్టు సభ్యులకు మాత్రం ఈ సంగతి తెలుసు!’... నాలుగో టెస్టు పరాజయం అనంతరం కోచ్‌ రవిశాస్త్రి వ్యాఖ్యలివి.సిరీస్‌లో తామెంతగానో పోరాడామని, గెలుపే మొహం చాటేసిందనిసర్దిచెప్పుకొనేందుకు అతడు చేసిన ప్రయత్నం ఇది. ఇప్పుడు ఐదో టెస్టూముగిసింది. కోహ్లి సేన ఓటమి అంతరం 1–4గా మారింది. శాస్త్రి చెప్పినట్లు...టీమిండియా నిజంగానే పోరాడి ఓడిందా? మరి ఆ పోరాటానికి ‘ముగింపు’గావిజయాలు ఎందుకు దక్కలేదు? అనేది విశ్లేషించుకోవాల్సిన సమయం.

సాక్షి క్రీడా విభాగం  :తమది విదేశాల్లో గెలుపు రుచి తెలిసిన జట్టని, గత జట్ల కంటే భిన్నమైనదని గొప్పలకు పోయి ఇంగ్లండ్‌ గడ్డపై అడుగిడిన కోహ్లి సేన... ఫలితాల్లో మాత్రం దానిని చూపలేకపోయింది. టి20 సిరీస్‌ను కైవసం చేసుకుని, వన్డే సిరీస్‌లో ప్రతిఘటన చూపి ఆత్మవిశ్వాసంతో కనిపించిన టీమిండియా, అసలు సమరమైన టెస్టులకు వచ్చేసరికి సగటు జట్టులా మారిపోయింది. తుది జట్టు ఎంపికలో పొరపాట్లు, కీలక సందర్భాల్లో నిలకడ లేమి, గెలుపు మెట్టుపై చేతులెత్తేయడం... ఇలా సిరీస్‌ సాగుతున్నకొద్దీ ఒక్కొక్క లోపం బయటపడసాగాయి. కీలక పేసర్లు భువనేశ్వర్, బుమ్రా గాయాల బారినపడటంలో వారి పాత్ర కంటే జట్టు మేనేజ్‌మెంట్‌ ముందుచూపు కొరవడటమే ఎక్కువ. ఇది ప్రణాళిక లోపాన్ని కూడా చాటింది. బుమ్రా అందుబాటులోకి వచ్చినా, ఇంగ్లండ్‌ పరిస్థితుల్లో అతి  ముఖ్యమైన భువీ సేవలు పూర్తిగా కోల్పోవాల్సి వచ్చింది. అతడే ఉండి ఉంటే ప్రత్యర్థి లోయర్‌ ఆర్డర్‌ను పడగొట్టడంతో పాటు మన లోయర్‌ ఆర్డర్‌లో బ్యాట్‌తోనూ ఓ చేయి వేసేవాడు. తద్వారా రెండు జట్ల మధ్య తేడా పెద్దగా ఉండకపోయేది. మొత్తంగా చూస్తే జట్టు ప్రదర్శన పర్వాలేకున్నా, విజయ తీరాలకు చేర్చే మొనగాడు లేక ఓటమి భారం మోయాల్సి వస్తోంది. 

టెస్టులకూ అలాంటివాడొకరు.... 
ధోని రూపంలో మ్యాచ్‌లను ముగించగల ఆటగాడు ఉండటంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు ప్రబలంగా తయారైంది. అలాంటివాడు ఇప్పుడు టెస్టులకూ అవసరం అని స్పష్టమైంది. ఈ సిరీస్‌లో టీమిండియా బర్మింగ్‌హామ్‌లో 31 పరుగులతో, సౌతాంప్టన్‌లో 60 పరుగులతో, ఓవల్‌లో 118 పరుగులతో ఓడింది. కొద్దిగా ప్రయత్నిస్తే ఈ మ్యాచ్‌ల్లో విజయం సాధించగలిగేది. కానీ, 6, 7 స్థానాల్లో నిలదొక్కుకుని తర్వాత వచ్చేవారిని కాపాడుకుంటూ గట్టెక్కించే నాథుడు లేక తక్కువ తేడాతోనే రెండు టెస్టులను కోల్పోవాల్సి వచ్చింది. వీటిలో గెలిచి ఉంటే... శాస్త్రి చెప్పినట్లు సిరీస్‌ స్వరూపం మరోలా ఉండేది. 

ఆల్‌రౌండర్‌కు తప్పని వెదుకులాట 
ఇంగ్లండ్‌కు కరన్, వోక్స్, స్టోక్స్, మొయిన్‌ అలీ వంటి ఒకరికి నలుగురు నమ్మదగ్గ ఆల్‌రౌండర్లు ఉంటే మనకు హార్డిక్‌ పాండ్యా ఒక్కడే దిక్కయ్యాడు. నాటింగ్‌హామ్‌లో మెరిసినా, మిగతా మూడు టెస్టుల్లో చెప్పుకోదగ్గ ఆట కనబర్చలేదు. దీంతో ఐదో టెస్టుకు బౌలింగ్‌ వనరులను తగ్గించుకుని మరీ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారికి చోటివ్వాల్సి వచ్చింది. 

బ్యాట్స్‌మెన్‌ బాధ్యత ఇంతేనా? 
ఓపెనర్ల వైఫల్యాల ‘కుర్చీలాట’ అటుంచితే... 593 పరుగులతో బ్యాట్స్‌మన్‌గా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సిరీస్‌లో వందకు వంద మార్కులు సాధించాడు. వైస్‌ కెప్టెన్‌ రహానే మాత్రం పాస్‌ మార్కులు కూడా పొందలేకపోయాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు సాధించినవి రెండే అర్ధ శతకాలు. అవి కూడా మూడు, నాలుగు టెస్టుల్లోనే! ఈ స్థాయి ఆటతో ఏవిధంగానూ న్యాయం చేయలేకపోయాడు. తన మీద జట్టు మేనేజ్‌మెంట్‌కు నమ్మకం లేకపోవడంతో పాటు, అభిమానులు పెట్టుకున్న ‘మిస్టర్‌ డిపెండబుల్‌’ నమ్మకం బీటలు వారుతున్న చతేశ్వర్‌ పుజారాది చిత్రమైన పరిస్థితి. అతడి ఏకాగ్రత తరచూ చెదురుతోంది. నాలుగో టెస్టులో అజేయ శతకం చేసినా, ఓవల్‌లో కీలక సమయంలో విఫలమై నిరాశ పర్చాడు. దీంతో కోహ్లి మినహా... ఎవరినీ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా పరిగణించలేని పరిస్థితి. 

బౌలర్లు భళా... కానీ! 
అలిస్టర్‌ కుక్‌ ఉన్నపళంగా రిటైరయ్యాడన్నా, తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ అర్ధ శతకం, శతకం మాత్రమే చేయగలిగాడన్నా అది భారత పేసర్ల ఘనతే. ఆతిథ్య జట్టు టాప్‌ ఆర్డర్‌ను పదేపదే కుప్పకూల్చిన వారి శ్రమను ఎంత పొగిడినా తక్కువే. కుక్‌ను వరుసగా మూడుసార్లు ఔట్‌ చేసిన ఇషాంత్‌ ప్రధాన బౌలర్‌ హోదాకు, విశేష అనుభవానికి సార్థకత చేకూర్చాడు. ఇదే సమయంలో లోయర్‌ ఆర్డర్‌ను పెవిలియన్‌ చేర్చడంలో పేసర్లు విఫలమయ్యారు. ఇందులో వారి ప్రయత్న లోపం కంటే ప్రత్యర్థి ఆటగాళ్ల పట్టుదలే ఎక్కువ. తరచి చూస్తే బౌలింగ్‌లోనూ మెరుపు స్పెల్‌తో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను ‘ఫినిష్‌’ చేసే బౌలర్‌ అవసరం ఉందనిపిస్తోంది. 

మధురమే... 
2014 పర్యటనలో తీవ్ర వైఫల్యాలతో అవమాన భారం మూటగట్టుకున్న విరాట్‌ కోహ్లి ఈసారి వందల కొద్దీ పరుగులతో ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌నని చాటుకున్నాడు. సమకాలికుడైన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ తనకెంతో దూరంలో ఉన్నాడని స్పష్టం చేశాడు. సిరీస్‌ కోల్పోవడం ఒక్కటే కోహ్లి గొప్పదనాన్ని తక్కువ చేసి చూపుతోంది. ఎవరూ ఊహించని విధంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన కుక్‌... ఆఖరి ఇన్నింగ్స్‌లో భారీ శతకంతో కెరీర్‌ను సంతృప్తికరంగా ముగించాడు. ఇక ఐదు టెస్టుల్లోనూ ఆటలో అరటిపండుగా మిగిలిపోయిన ఆదిల్‌ రషీద్‌... ద్విశతక భాగస్వామ్యంతో దూసుకెళ్తున్న రాహుల్, పంత్‌లను ఔట్‌ చేసి చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ చేజారిపోకుండా చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement