
హైదరాబాద్: ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి అనేక కారణాలు. బలహీన మిడిలార్డర్, నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మన్ లేకపోవడం వంటి కారణాలను క్రీడా విశ్లేషకులు వెతుకుతున్నారు. అయితే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీ అనంతరం వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో అందరి దృష్టి భారత జట్టు ఎంపికపై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తుండటంతో పలువురు ఆటగాళ్లు తెరపైకి వస్తున్నారు. మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, ఖలీల్ అహ్మద్, సిరాజ్ వంటి వారిపైనే కాకుండా మరికొంత మంది యువ కిశోరాలపై సెలక్టర్ల కన్ను పడింది. గతకొంత కాలంగా దేశవాళీ టోర్నీల్లో విశేషంగా రాణిస్తున్న ప్రియాంక్ పంచల్, అభిమన్యు ఈశ్వరన్, నవదీపై సైనీ, రాహుల్ చహర్, కేఎస్ భరత్ వంటి యువ ఆటగాళ్లు విండీస్ పర్యటనలో టీమిండియా తరుపున అరంగేట్రం చేసే అవకాశం ఉందని జోరుగా వార్తలు వస్తున్నాయి.
టీమిండియా యువ కిశోరం పృథ్వీ షా గాయం తర్వాత ఫిట్‌నెస్ నిరూపించుకోలేదు. సెలక్టర్ల సమావేశంలోపు పృథ్వీ షా తన ఫిట్‌నెస్ నిరూపించుకంటేనే జట్టులో ఉంటాడు లేకుంటే అంతే సంగతులు. ఇక టెస్టులకు సీనియర్ ఆటగాళ్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లను పూర్తిగా పక్కకు పెట్టే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారు. దీంతో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌తో పాటు మూడో ఓపెనర్‌గా గుజరాత్ సారథి ప్రియాంక్ పంచల్‌కు అవకాశం దక్కవచ్చు. గుజరాత్ సారథిగా, ఓపెనర్‌గా ప్రియాంక్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో ప్రియాంక్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక మరోవైపు బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ప్రియాంక్‌కు పోటీ ఇస్తున్నాడు. లిస్టు ఏ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, శ్రీలంకలపై పరుగుల ప్రవాహం సృష్టించిన ఈశ్వరన్ విండీస్ పర్యటనకు ఎంపిక చేస్తారనే ఆశాభావంతో ఉన్నాడు.
కీపర్‌గా ఎంఎస్ ధోని వారసుడిగా రిషభ్ పంత్ ఆల్‌మోస్ట్ ఫిక్స్ చేశారు. అయితే టెస్టుల విషయానికి వస్తే వృద్దిమాన్ సాహా గాయం నుంచి కోలుకోవడంతో సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపవచ్చు. అయితే పంత్, సాహాల తర్వాత కేఎస్ భరత్‌వైపు సెలక్టర్ల దృష్టి ఉంది. భారత్ ఏ మ్యాచ్‌ల్లో విశేష ప్రతిభతో సెలక్టర్లును ఆకట్టుకున్నాడు. భరత్ చివరి 11 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, రెండు అర్దసెంచరీల సహాయంతో 686 పరుగులు సాధించాడు. అంతేకాకుండా కీపింగ్‌లో 41 క్యాచ్‌లు, 6 స్టంపింగ్స్ చేశాడు. దీంతో టెస్టులకు రెగ్యులర్ కీపర్‌కు బ్యాకప్‌గా భరత్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. సెలక్టర్లు పంత్, సాహాలను కాదని భరత్‌ను ఎంపిక చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడి ప్రతిభ అలాంటిది.
ఇప్పటికిప్పుడు టీమిండియా తరుపున ఆడే సత్తా, అనుభవం, ప్రతిభ గల బౌలర్ నవదీప్ సైనీ. స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కంటే వేగంగా బౌలింగ్ చేయగల సామర్థ్యం.. వికెట్లు తీయగల నైపుణ్యం అతడి సొంతం. ఇప్పటికే కోహ్లి సేనతో పాటు విదేశీ పర్యటనలకు వెళుతూ.. నెట్స్‌లో బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేస్తూ వారి ప్రాక్టీస్‌కు దోహదపడుతున్నాడు. ఇక ఐపీఎల్, లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో వికెట్లు పడగొడుతున్న సైనీ అతి త్వరలోనే టీమిండియా జెర్సీ వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ప్రస్తుత క్రికెట్‌లో మణికట్టు స్పిన్నర్లు జోరు నడుస్తోంది. టీమిండియా స్పిన్నర్లు చాహల్, కుల్దీప్‌లు తమ మాయాజాలంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతున్నారు. అయితే ప్రపంచకప్‌లో వారు విఫలమవ్వడంతో వారికి ప్రత్యామ్నాయంగా రాహుల్ చహర్ తెరపైకి వచ్చాడు. టీమిండియా- ఏ తరుపున తనదైన శైలిలో రాణిస్తున్న ఈ స్టైలీష్ స్పిన్నర్‌పై సెలక్టర్ల కన్నుపడింది. బౌలింగ్‌లో వేగం.. అంతకుమించి వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకుంటున్న చహర్ కనీసం టీ20లకైనా సెలక్ట్ అవుతాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.