టీమిండియా ఘనవిజయం
మొహాలి:నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శనివారం మూడో రోజు 218 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 109 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో వేన్ జిల్(36) ఫర్వాలేదనిపించగా, డీన్ ఎల్గర్(16), ఫిలిండర్(1), డు ప్లెసిస్(1), హషీమ్ ఆమ్లా(0), ఏబీ డివిలియర్స్(16) , విలాస్(7), హర్మర్(11) లు ఘోరంగా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. టీమిండియా స్పిన్ త్రయం రాణించి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు కళ్లెం వేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు సాధించగా, అశ్విన్ కు మూడు వికెట్లు, అమిత్ మిశ్రాకు ఒక వికెట్ దక్కింది. మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకుముందు 125/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియా 200 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో టీమిండియాకు ఓవరాల్ గా 217 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా ఆటగాళ్లలో మురళీ విజయ్(47), చటేశ్వర పూజారా(77) లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. జట్టు స్కోరు 161 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లి(29) మూడో వికెట్ గా పెవిలియన్ కు చేరగా, ఆపై మరో 17 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది. కాగా వృద్ధిమాన్ సాహా(20) చివరి వరస బ్యాట్స్ మెన్ తో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. దీంతో టీమిండియా రెండొందల మార్కును చేరుకోగలిగింది.
అశ్విన్, జడేజాలు తిప్పేశారు
టీమిండియా ఘనవిజయంలో స్పిన్నర్ల పాత్రనే ప్రముఖం పేర్కొనాలి. తొలి ఇన్నింగ్స్ లో 51 పరుగులకే ఐదు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా రాణించాడు. 39 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. కాగా, జడేజా తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో 21 పరుగులిచ్చి ఐదు వికెట్లను సాధించాడు. వీరిద్దరికి జతగా స్పిన్నర్ అమిత్ మిశ్రాకు రెండు ఇన్నింగ్స్ లలో కలిపి మూడు వికెట్లు లభించాయి. మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లలో నలభై వికెట్లకు స్పిన్నర్లకు 34 వికెట్లు లభించడం విశేషం.
యాభై వికెట్ల క్లబ్ లో జడేజా
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో కలుపుకుని ఎనిమిది వికెట్లు సాధించిన రవీంద్ర జడేజా యాభై వికెట్ల క్లబ్ లో చేరాడు. 13 టెస్టు మ్యాచ్ లు ఆడిన జడేజా 53 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్ లీగ్ లో విశేషంగా రాణించి టెస్టుల్లో స్థానం సంపాదించిన జడేజా తదుపరి టెస్టుల్లో కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.