ముందుచూపు లేకుంటే... | Ten years on, Athens 2004 gives Greece little to cheer | Sakshi
Sakshi News home page

ముందుచూపు లేకుంటే...

Published Wed, Aug 13 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

ముందుచూపు లేకుంటే...

ముందుచూపు లేకుంటే...

ముందుచూపు లేకుంటే ముందడుగు వేయలేం. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున (ఆగస్టు 13న) ఏథెన్స్ ఒలింపిక్స్ క్రీడలకు తెరలేచింది. ఎన్నో ప్రతికూలతలు ఉన్నా... విశ్వ క్రీడలకు పుట్టిల్లు అయిన ఏథెన్స్ ఆనాడు నభూతో నభవిష్యత్ అన్నరీతిలో ఈ క్రీడలను నిర్వహించాలని తలచింది. కొత్త స్టేడియాల నిర్మాణాల కోసం ఏకంగా అప్పట్లోనే 12 బిలియన్ డాలర్లను (రూ. 7 లక్షల 35వేల కోట్లు) వెచ్చించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ స్టేడియాల్లో ఎక్కువ శాతం నేడు ఏమాత్రం ఉపయోగంలో లేకుండా పోయాయి.
 
దీనావస్థలో ఏథెన్స్ ఒలింపిక్స్ స్టేడియాలు

- పదేళ్లలో ఎంతో మార్పు
- కనీస ఉపయోగంలోని పలు వేదికలు
 ‘స్టేడియాలు కట్టేశాం. క్రీడలు ఘనంగా నిర్వహించేశాం’ అని ఏథెన్స్ నిర్వాహకులు సంబరపడ్డారు. కానీ క్రీడలు ముగిశాక ఈ వేదికల పరిస్థితి ఏంటి? అన్న విషయంలో మాత్రం వారికి ముందుచూపు లేకుండా పోయింది. ఫలితంగా ఆనాడు కోట్ల డాలర్లతో కట్టిన స్టేడియాలు నేడు తెల్ల ఏనుగులుగా మారిపోయాయి. ప్రస్తుతం గ్రీస్ 465 బిలియన్ డాలర్ల అప్పుల్లో ఉంది. ఈ పాపంలో నాటి ఒలింపిక్స్ నిర్వహణ కూడా భాగమేనని అక్కడి మేధావులు అభిప్రాయపడ్డారు.


‘ఒలింపిక్ పుట్టినిల్లు కాబట్టి వాటి నిర్వహణ కోసం దేశం ఉత్సాహం చూపించింది. అయితే దురదృష్టకరం ఏమిటంటే అంతర్జాతీయ స్థాయిలో చూస్తే క్రీడల్లో గ్రీస్‌కు పెద్దగా గుర్తింపు లేదు. ఎన్నో పాపులర్ క్రీడాంశాల్లో అక్కడి ఆటగాళ్ల పేరు కూడా వినిపించదు. దాని ఫలితమే ఈ పరిస్థితి. స్టేడియాలు ఉన్నా వాటిని ఉపయోగించేవారు ఎక్కడ? లండన్ ఒలింపిక్స్‌లో గ్రీస్ కేవలం 2 కాంస్యాలు మాత్రమే సాధించిందంటే ఇక్కడి ఆటల పరిస్థితి అర్థమవుతుంది’ అని మాజీ ఆటగాడు ఒకరు వ్యాఖ్యానించారు.

జాతీయ క్రీడల కోసం, ఆఫ్రో ఆసియా క్రీడల కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్మించిన స్టేడియాల్లోనూ గతంతో పోలిస్తే క్రీడల నిర్వహణ తగ్గింది. కోట్ల రూపాయలు వెచ్చించి కట్టే స్టేడియాలు... క్రీడల తర్వాత కూడా అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఏథెన్స్ తరహా అనుభవాలను మనం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది..!
 - సాక్షి క్రీడావిభాగం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement