అందుకే తీసేశారా!
ఇటీవల భారత జట్టు జింబాబ్వేలో మూడు వన్డేలు, రెండు టి20ల సిరీస్ ఆడిన విషయం గుర్తిందిగా. ఆ పర్యటనకు అజింక్య రహానేను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయమూ తెలిసిందే. తనలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయో పరిశీలించడానికి రహానేను ఎంపిక చేశామని ఆనాడు చెప్పారు. కానీ వాస్తవం అది కాదట. సురేశ్ రైనాను ఈ సిరీస్‌కు కెప్టెన్‌ను చేద్దామని తొలుత భావించారు. అయితే సరిగ్గా జట్టు ఎంపిక కోసం సెలక్టర్లు సమావేశమైన రోజే... ఓ వార్త బయటకు వచ్చింది.
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రైనా, జడేజా, బ్రేవో డబ్బులు తీసుకున్నారంటూ లలిత్ మోదీ ఐసీసీకి ఓ లేఖ రాశారు. ఆ విషయం బయటకు రావడంతో సెలక్టర్లు రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించారు. ఎందుకైనా మంచిదని రైనాకు విశ్రాంతి ఇచ్చి రహానేకు పగ్గాలు అప్పజెప్పారు. అయితే లలిత్ మోదీ లేఖలో వాస్తవాలు లేవంటూ ఐసీసీ దీనిని కొట్టి పారేసింది. కానీ పాపం రైనా. భారత జట్టుకు మరోసారి సారథిగా వ్యవహరించే అవకాశం కోల్పోయాడు.