
ఆ ముగ్గురిపై వేటు పడింది
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో వివాదానికి కారణమైన కోచ్, ఆటగాళ్లపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అట్లెటికో డి కోల్‌కతా కోచ్ అంటోనియో లోపెజ్ హబాస్‌పై నాలుగు మ్యాచ్‌లు... రాబర్ట్ పైర్స్ (గోవా), ఫిక్రూ లామేసా (కోల్‌కతా)లపై చెరో రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ విధించింది. దీంతో పాటు ఈ ముగ్గురిపై తలా రూ. 5 లక్షల జరిమానా వేసింది. లీగ్ రూల్ 22.2ను ఉల్లంఘించినందుకు కోల్‌కతా గోల్ కీపర్ ప్రదీప్ కుమార్ భక్తావర్‌ను తర్వాతి మ్యాచ్‌లో ఆడకుండా సస్పెండ్ చేయడంతో పాటు రూ. 30 వేల జరిమానా విధించింది.
ఏఐఎఫ్‌ఎఫ్ క్రమశిక్షణ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాలపై అప్పీలు చేసుకునేందుకు ఆటగాళ్లకు నాలుగు రోజుల గడువు ఇచ్చారు. ‘ఈ ముగ్గురు ఏఐఎఫ్‌ఎఫ్ క్రమశిక్షణ నియమావళిలోని ఆర్టికల్ 58ని ఉల్లంఘించారు. అయితే కోచ్ హబాస్ రెండోసారి ఈ నిబంధనను దాటాడు. ఆట స్ఫూర్తిని చెడగొట్టే విధంగా ప్రవర్తించినందుకు సమాఖ్య గతంలో ఈ కోచ్‌కు సమన్లు కూడా జారీ చేసింది.
మొత్తానికి ఈ ముగ్గురు తప్పుడు ప్రవర్తనతో ఆటకు మచ్చ తెచ్చారు’ అని ఏఐఎఫ్‌ఎఫ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. గురువారం కోల్‌కతా, గోవాల మధ్య మ్యాచ్‌లో ప్రథమార్ధం ముగిశాక టన్నెల్ నుంచి వెళ్తున్నప్పుడు తమ ఆటగాడు పైర్స్ ముఖంపై హబాస్ కొట్టాడని గోవా కోచ్ జికో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.