గతంలో పలువురు వరల్డ్ నంబర్‌వన్ క్రీడాకారిణులకు కోచ్‌గా ఉన్న ఫిసెట్
సీజన్ ముగింపు టోర్నీలో బాధ్యతల స్వీకరణ
వాషింగ్టన్: మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) కొత్త కోచ్‌ను నియమించుకుంది. వచ్చే నెలలో సౌదీ అరేబియా వేదికగా జరగనున్న సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో విమ్ ఫిసెట్ మార్గనిర్దేశకత్వంలో స్వియాటెక్ బరిలోకి దిగనుంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్ పరాజయం అనంతరం చైనా ఓపెన్, కొరియా ఓపెన్‌కు దూరంగా ఉన్న స్వియాటెక్... త్వరలో తిరిగి కోర్టులో అడుగు పెట్టనుంది.
ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు, గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన నయోమి ఒసాకా (జపాన్), సిమోనా హాలెప్ (రొమేనియా), అజరెంకా (బెలారస్), ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) వంటి మేటి ప్లేయర్లకు కోచ్‌గా వ్యవహరించిన ఫిసెట్... ఇకపై స్వియాటెక్‌కు శిక్షణ ఇవ్వనున్నాడు. ‘కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం డబ్ల్యూటీఏ ఫైనల్స్ కోసం రెడీ అవుతున్నా. దీర్ఘ కాలిక ప్రణాళికలో భాగంగా కొత్త కోచ్‌ను ఎంపిక చేసుకున్నా.
ఫిసెట్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అత్యుత్తమ ప్లేయర్లకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఫిసెట్ సొంతం’ అని స్వియాటెక్ శుక్రవారం వెల్లడించింది. సుదీర్ఘ కాలంగా విక్టరోస్కీ వద్ద శిక్షణ తీసుకున్న స్వియాటెక్ తొలిసారి విదేశీ కోచ్‌ను నియమించుకుంది.
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్వియాటెక్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఐదు గ్రాండ్‌స్లామ్స్ టోర్నీలలో విజేతగా నిలిచింది. అందులో యూఎస్ ఓపెన్ (2022), ఫ్రెంచ్ ఓపెన్ (2020, 2022, 2023, 2024) టైటిళ్లు ఉన్నాయి. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో స్వియాటెక్ కాంస్య పతకం గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment