
బీసీసీఐ నిర్ణయం భేష్..
న్యూఢిల్లీ:అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సుముఖత వ్యక్తం చేయడంపై మాజీ ఆటగాళ్లు హర్హం వ్యక్తం చేశారు. డీఆర్ఎస్ పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉన్నట్లు భారత మాజీ కెప్టెన్లు మొహ్మద్ అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీలు స్పష్టం చేశారు.
'నేను ఆడుతున్న రోజుల నుంచి డీఆర్ఎస్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం డీఆర్ఎస్ విధానం అప్పటికంటే చాలా మెరుగ్గా ఉంది. దాంతో బీసీసీఐ ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి వెనకడుగు వేయలేదు. అందుకు కారణం కూడా లేదనే అనుకుంటున్నా. ఇంగ్లండ్ తో డీఆర్ఎస్ను పరీక్షించాలనే నిర్ణయం నిజంగా ఆహ్వానించదగిందే' అని గంగూలీ తెలిపాడు.
'భారత జట్టు ఇప్పటికే డీఆర్ఎస్ టెక్నాలజీని వాడుకోవాల్సింది. ఈ టెక్నాలజీకి అప్పట్లో బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో అనేక మ్యాచ్లను దగ్గరగా వచ్చి కోల్పోయాం. కాస్త ఆలస్యమైనా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం బాగుంది. ఇది ఒక మంచి ఆలోచన'అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో అజహరుద్దీన్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ప్రయోగాత్మకంగా డీఆర్ఎస్ ను అమలు చేయాలని నిర్ణయించింది. గతంతో పోలిస్తే డీఆర్‌ఎస్‌లో పలు మార్పులు చోటు చేసుకోవడంతో బీసీసీఐలో అంతర్గతంగా చర్చ జరిగింది. తాజాగా డీఆర్‌ఎస్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్‌మండలి (ఐసీసీ) భారత క్రికెట్ బోర్డుకు వీడియో ప్రదర్శన ద్వారా చూపింది.దీనిపై బీసీసీఐ అంగీకారం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.