నేటి నుంచే... బాక్సింగ్‌ 'ఢీ' టెస్టు | Third test match india between against in boxing day | Sakshi
Sakshi News home page

నేటి నుంచే... బాక్సింగ్‌ 'ఢీ' టెస్టు

Published Wed, Dec 26 2018 12:25 AM | Last Updated on Wed, Dec 26 2018 12:25 AM

Third test match india between against in boxing day - Sakshi

మూడు విదేశీ సిరీస్‌ విజయాలే లక్ష్యంగా 2018ని ప్రారంభించింది టీమిండియా. ఆటగాళ్ల గాయాలు, తుది జట్టు ఎంపికలో పొరపాట్లు, బ్యాటింగ్‌ వైఫల్యాలతో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో ఒక్కో గెలుపుతో సరిపెట్టుకుని వెనుదిరిగింది. ఇవే లోపాలు వెంటాడుతుండగా ఇప్పుడు ఏడాది ఆఖరులో... మూడో సిరీస్‌ మధ్యలో నిలిచింది. దీనిని కూడా కోల్పోకుండా ఉండాలంటే... ఒక్క గెలుపు సరిపోయే స్థితిలో కొంత మెరుగ్గానే ఉంది. మరి... కోహ్లి సేన ఏం చేస్తుందో?

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) అంటేనే తెలియని ఆకర్షణ. క్రిస్మస్‌ను ఆనందంగా జరుపుకొని వేలాదిగా హాజరయ్యే ప్రేక్షకుల మధ్య బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభమై దానిని రెట్టింపు చేస్తుంది. ఆ హంగామాకు ఈసారి పోటాపోటీ సిరీస్‌ తోడై అభిమానులకు మరింత మజా ఇవ్వనుంది. మరి... ఫలితాన్ని 1–1 నుంచి 2–1కి మార్చే జట్టేదో?

పెర్త్‌లో పరాజయం పాలైన టీమిండియా పైచేయికి ప్రయత్నిస్తుందా? తమ చరిత్రలోనే చేదైన అనుభవాలు మిగిల్చిన 2018కి... సొంతగడ్డపై వరుసగా రెండో విజయంతో కంగారూలు వీడ్కోలు పలుకుతారా? చూద్దాం...  ఎవరి పంతం నెగ్గుతుందో?  

మెల్‌బోర్న్‌: అనుకున్నట్లే పెర్త్‌ టెస్టు ఓటమి టీమిండియాలో భారీ మార్పుచేర్పులకు దారితీసింది. బుధవారం నుంచి మెల్‌బోర్న్‌లో జరుగనున్న మూడో టెస్టుకు రెగ్యులర్‌ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్‌ రాహుల్‌ ఇద్దరిపై ఒకేసారి వేటుపడేలా చేసింది. కొంత సంచలనమైనా మెల్‌బోర్న్‌లో కోహ్లి సేన సాహసానికి దిగక తప్పని పరిస్థితి కల్పించింది. ఈ ప్రకంపనల నేపథ్యంలో కర్ణాటక పరుగుల యంత్రం మయాంక్‌ అగర్వాల్‌ అరంగేట్రం ఖాయమైంది. ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ హనుమ విహారిపై ఇన్నింగ్స్‌ ఆరంభించే పెద్ద బాధ్యత పడింది. ఫిట్టా, అన్‌ఫిట్టా అనే ఊహాగానాలకు తెరదించుతూ రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజాలకు తుది 11 మందిలో చోటు దక్కింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా... బ్యాట్స్‌ మన్‌ హ్యాండ్స్‌కోంబ్‌ స్థానంలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌ మిషెల్‌ మార్ష్‌ను తీసుకుంది. ఆటతో, మాటతో ఇప్పటికే వేడెక్కిన సిరీస్‌ను... ‘బాక్సింగ్‌ డే’ సమరం ఇంకెంత రసవత్తరం చేస్తుందో చూడాలి. 

మయాంకొచ్చాడు... వారిద్దరూ ఔట్‌ 
లెక్కకు మిక్కిలి అవకాశాలతో పాటు అంతే స్థాయిలో వైఫల్యాలను మూటగట్టుకున్న విజయ్, రాహుల్‌లను ఇంకెంతమాత్రం భరించలేని టీమిండియా... కొత్త కుర్రాళ్లైనా, కఠిన పరిస్థితులు ఎదురవనున్నా ఏమాత్రం సంకోచించకుండా మయాంక్, విహారిలను ఓపెనర్లుగా దించేందుకే సిద్ధమైంది. బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు రోహిత్‌ శర్మను ఆరో స్థానంలో పంపనుంది. ఫిట్‌నెస్‌పై విపరీత చర్చ జరిగినప్పటికీ స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా జడేజానే ఎంచుకుంది. పక్కటెముకల నొప్పి నుంచి ఇంకా కోలుకోని ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్, ఫిట్‌నెస్‌పై అనుమానాలతో పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలకు అవకాశం దక్కలేదు. కూర్పు రీత్యా బ్యాటింగ్‌ భారాన్ని కెప్టెన్‌ కోహ్లి, పుజారా, రహానే త్రయమే మోయాలి. వీరిలో ఏ ఇద్దరు నిలిచినా భారీ స్కోరు ఖాయం. కొద్దిసేపు నిలవగలిగితే రోహిత్, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ నుంచి మంచి ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చు. పేసర్లు ఇషాంత్, షమీ, బుమ్రా చక్కగా రాణిస్తున్నారు. అయితే, ప్రత్యర్థి టాపార్డర్‌లానే లోయరార్డర్‌ను కూడా వీరు పడగొట్టాలి. చకచకా ఓవర్లు వేసే జడేజా... పరిస్థితులకు తగ్గట్లు వికెట్లు సైతం తీస్తే జట్టుకు మేలు చేకూరుతుంది. 

హనుమా... గట్టెక్కించుమా? 
కెరీర్‌లో మూడో టెస్టు ఆడబోతున్న ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి... మెల్‌బోర్న్‌లో ఓపెనింగ్‌కు దిగబోతూ ప్రస్తుతం కీలకమైన ఘట్టం ముందున్నాడు.  రంజీల్లోనూ ఇన్నింగ్స్‌ ప్రారంభించని అతడు ఇప్పుడు ఏకంగా టీమిండియా ఓపెనర్‌గా దిగుతున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ప్రధాన పేసర్‌ స్టార్క్‌ పదునైన బంతులను దీటుగా ఎదుర్కొన్న తీరే బహుశా విహారికి ఈ అవకాశం దక్కేలా చేసింది. టెక్నిక్, దృక్పథం రెండూ ఉన్న అతడు మంచి ఇన్నింగ్స్‌తో ఈ సవాల్‌ను అధిగమించగలిగితే జట్టు మేనేజ్‌మెంట్‌ నెత్తిన పాలుపోసినవాడవుతాడు. తద్వారా, టెస్టు జట్టులో కీలక సభ్యుడిగానూ ఎదుగుతాడు. అటు నిత్యం ఊగిసలాటలో ఉండే ఆరో స్థానం కంటే, ఓపెనర్‌గా నిలదొక్కుకుంటే వ్యక్తిగతంగానూ అతడి కెరీర్‌కు మేలు చేకూరుతుంది. దీనిని అందిపుచ్చుకుని విహారి విజయవంతమవ్వాలని ఆశిద్దాం.  

ఆసీస్‌... వ్యూహాత్మకంగా 
బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆతిథ్య జట్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ హ్యాండ్స్‌కోంబ్‌ను తప్పించి మిషెల్‌ మార్ష్‌ ఆడిస్తోంది. పిచ్‌ పేసర్లకు అనుకూలించవచ్చన్న అంచనానే దీనికి కారణమై ఉండొచ్చు. మిషెల్‌ బ్యాటింగ్‌లోనూ నమ్మదగినవాడే. ధాటిగా పరుగులు రాబట్టే ఓపెనర్‌ అరోన్‌ ఫించ్, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖాజా, షాన్‌ మార్‌‡్షలను త్వరగా వెనక్కుపంపాలి. పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్‌ల పదునైన బంతులను కాచుకోవడం భారత ఓపెనర్లకు కఠిన పరీక్ష. పిచ్‌ ఎలా ఉన్నా, వికెట్లు తీస్తున్న నాథన్‌ లయన్‌... రెండు జట్ల మధ్య తేడా తానేనని చాటుకున్నాడు. ఇతడి లయను దెబ్బతీస్తే కోహ్లి సేన పని సులువవుతుంది. 

►2 ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో నెగ్గగా... అందులో రెండు (1977, 1981) మెల్‌బోర్న్‌లోనే వచ్చాయి. ఓవరాల్‌గా భారత్‌ మెల్‌బోర్న్‌లో 12 టెస్టులు ఆడి రెండింటిలో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని ఎనిమిదింటిలో ఓడిపోయింది.  

పిచ్, వాతావరణం 
గతేడాది యాషెస్‌ టెస్టు నిస్సారమైన ‘డ్రా’గా ముగియడంతో మెల్‌బోర్న్‌ పిచ్‌ను ఐసీసీ నాసిరకం అని తేల్చింది. తర్వాత షెఫీల్డ్‌ షీల్డ్‌ మ్యాచ్‌లూ ఇదే విధంగా సాగాయి. ఇప్పుడు మాత్రం పచ్చికతో పిచ్‌ జీవం ఉన్నట్లు కనిపిస్తోంది. నాలుగు రోజులు చక్కటి ఎండ కాయనుంది. ఈ ప్రభావం పిచ్‌పైనా పడే అవకాశం ఉంది. టాస్‌ గెలిచిన జట్టు మొదట బౌలింగ్‌కే మొగ్గుచూపొచ్చు. 

తుది జట్లు 
భారత్‌: మయాంక్‌ అగర్వాల్, విహారి, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానే, రోహిత్, పంత్, జడేజా, షమీ, ఇషాంత్, బుమ్రా. 
ఆస్ట్రేలియా: ఫించ్, హారిస్, ఖాజా, షాన్‌ మార్ష్‌, హెడ్, మిషెల్‌ మార్ష్‌, పైన్‌ (కెప్టెన్‌), స్టార్క్, కమిన్స్, లయన్, హాజల్‌వుడ్‌. 

ఉదయం గం. 5.00 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3లో ప్రత్యక్ష ప్రసారం  

బ్యాట్స్‌మెన్‌... బాధ్యతగా ఆడండి 
అద్భుతంగా రాణిస్తున్న మా బౌలర్లకు సమష్టి ప్రదర్శనతో బ్యాట్స్‌మెన్‌ అండగా నిలవాలి. మేం మెరుగైన స్కోరు చేయకుంటే బౌలర్లు ఏమీ చేయలేరు. నాథన్‌ లయన్‌ను ఎదుర్కొనేందుకు మా వద్ద ప్రణాళికలున్నాయి. మైదానంలో జరిగిన దానికి (పైన్‌తో వాగ్వాదం) బయట ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. నేను ఇలాంటి వాడిని అని బ్యానర్‌ కట్టుకుని తిరుగుతూ బయటి ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదు. మిగతా వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం  నా పని కూడా కాదు. ఎందుకంటే... ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి.    
– భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement