ధోనీసేనను ఓడించి.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి ఎంటరైన విండీస్ ఆటగాళ్లు ఫుల్‌గా మజా చేశారు. ఆడారు. పాడారు. చిందులు వేశారు. సెమీఫైనల్‌లో 193 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన వెస్టిండీస్ ఆటగాళ్ల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. ఇటు మైదానంలో, అటు డ్రెస్సింగ్‌లో రూమ్‌లో ఆటగాళ్లు సందడే సందడి చేశారు. క్యాలిప్సో స్టెప్పులతో అదరగొట్టారు. షర్ట్ లేకుండానే క్రిస్ గేల్, డ్వేయిన్ బ్రావోలు డీజే డాన్స్ తో దుమ్మురేపారు. డీజేగా బ్రావో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇండియాపై గెలుపుతో ఆ టాలెంట్‌ను అతను బయటపెట్టాడు. వాంఖడే స్టేడియంలో డీజే ట్రాక్స్ వినిపించాడు.
ఆ బీట్స్‌కు గ్రేల్తో కలిసి డాన్స్ చేశాడు. ఆ జట్టు ఆటగాళ్లంతా 'చాంపియన్.. చాంపియన్' అంటూ ఉర్రూతలూగారు. హోటల్ గదికి వెళ్లిన తర్వాత కూడా వీళ్ల కెరింతలు ఆగలేదు. కెప్టెన్ డారెన్ సామి, ఆల్ రౌండర్ డ్వెయిన్ బ్రావో ల నేతృత్వంలో 'చాంపియన్' పాటకు ఆటగాళ్లంతా చిందులు వేశారు. డీజేగా కెరీర్ షురూ చేసిన బ్రావోనే స్వయంగా ఈ పాటను రాసి పాడాడు. బ్రేవో పాడుతుండగా.. విండీస్ ఆటగాళ్లంతా కోరస్ ఇస్తూ సందడి చేశారు. అటు వెస్టిండీస్ మహిళా ఆటగాళ్లు కూడా ఫుల్ ఫుల్ ఖుషీఖుషీగా గడిపారు. విండీస్ మహిళల జట్టు కూడా ఫైనల్‌లోకి ప్రవేశించడంతో అమ్మాయిలు డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు.