చెలరేగిన విధ్వంసకులు!
క్రిస్ గేల్, షాహిద్ ఆఫ్రిది.. 36 ఏళ్ల వయస్సు ఉన్న ఈ ఇద్దరూ వెటరన్ బ్యాట్స్‌మెన్ ఇటీవల వివాదాలు ఎదుర్కొన్నారు. కానీ తమదైన రోజు వస్తే మైదానంలో ఏ రేంజ్‌లో చెలరేగిపోతారో ఈ విధ్వంసకులు తాజాగా నిరూపించారు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచుల్లో తమ సత్తా తగ్గలేదని మరోసారి చాటారు. అద్భుతమైన సెంచరీతో వెస్టిండిస్‌ను క్రిస్ గేల్ విజయతీరాలకు చేరిస్తే.. బ్యాంటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ రాణించి ఆఫ్రిది పాకిస్థాన్ జట్టుకు తొలి గెలుపును అందించాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా క్రిస్ గేల్ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. 11 సిక్సర్లతో 47 బంతుల్లోనే సెంచరీ బాది తన పవర్ చాటాడు. దీంతో ఇంగ్లండ్ విసిరిన 183 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండిస్ అలవోకగా ఛేదించింది. అటు బంగ్లాదేశ్‌తో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్రిది 19 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 49 పరుగులు చేయడంతో మొదట బ్యాంటింగ్ చేసిన పాకిస్థాన్ 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఆఫ్రిది రెండు వికెట్లు తీశాడు. దీంతో బంగ్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది.
క్రిస్ గేల్‌కు వివాదాలు కొత్త కాదు. గత జనవరిలో బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ఆస్ట్రేలియా టీవీ ప్రజెంటర్‌ను డేటింగ్‌కు వస్తావని లైవ్‌లో గేల్ అడుగడం పెద్ద వివాదమే రేపింది. తన తాజా విశ్వరూపంతో గేల్ ఆ వివాదాన్ని పక్కకు తోసేసినట్టే. అయితే తన స్నేహితుడు, సహచర ఆటగాడు సలీయన్ బెన్‌ను వినోదం పంచడానికే తాను ఇంగ్లండ్ బౌలర్లపై వీరబాదుడు బాదనని గేల్ చెప్తున్నాడు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో తన సత్తా చాటిన ఆఫ్రిది కూడా స్వదేశంలో ఆగ్రహం ఎదుర్కొంటున్నాడు. పాకిస్థాన్ క్రికెటర్లకు భారత్‌లోనే అత్యధిక అభిమానం లభిస్తుందన్న వ్యాఖ్యలు అతడిని వివాదంలోకి నెట్టాయి. ఆఫ్రిది 'దేశద్రోహి' అంటూ విమర్శలూ వచ్చాయి. ఆ విమర్శలకు బ్యాటుతో, బంతితో సమాధానం ఇచ్చాడు ఆఫ్రిది. 'ఇది పెద్ద టోర్నీ. అందుకే జట్టును ముందుండి నడిపించే బాధ్యత కెప్టెన్‌గా నేనే తీసుకున్నా' అని ఆఫ్రిది మ్యాచ్ తర్వాత చెప్పాడు. తాను ఆకలితో ఉన్నానని, దేశం తరపున మంచి ఆటతీరు కనబర్చి తోటి ఆటగాళ్లకు మార్గదర్శకం నిలువాలని భావిస్తున్నానని ఆఫ్రిది తెలిపాడు.
పాపం జోయి!
వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 182 పరుగుల భారీ స్కోరు చేయగలిగిదంటే అందుకు కారణం జోయి రూట్. ఈ ఇంగ్లిష్ జట్టు ఆటగాడు చివరి నిమిషంలో మైదానంలోకి వచ్చి 36 బంతుల్లో రెండు సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ వీరవిహారంతో జోయి రూట్ ఆట పూర్తిగా కనుమరుగైంది. ఒత్తిడిలోనూ జోయి బాగా ఆడినా మ్యాచ్‌లో గేల్ ఆటతీరే హైలెట్‌గా నిలిచింది.