దేశవాళీ, ఐపీఎల్ తరహా లీగ్‌ల్లో మూడంకెల స్కోర్‌ను చేరుకోవడం సర్వసాధారణమైపోయినప్పటికీ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఈ మార్కును చేరుకోవడం చాలా అరుదుగా చూశాం. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో అయితే సెంచరీ సాధించిన ఆటగాళ్ల సంఖ్యను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచకప్ మొదలైన నాటి నుంచి ఇవాల్టి (అక్టోబర్ 27) దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్ వరకు కేవలం 10 శతకాలు మాత్రమే నమోదయ్యాయంటే నమ్మి తీరాల్సిందే.
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రొస్సో సాధించిన సుడిగాలి శతకం (56 బంతుల్లో 109; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పదవ శతకంగా రికార్డయ్యింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (117) తొలి శతకాన్ని నమోదు చేశాడు. 2007 ఇనాగురల్ టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై గేల్ శతకం బాదాడు. గేల్ తర్వాత పొట్టి ప్రపంచకప్‌లో రెండో శతకాన్ని టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా బాదాడు. రైనా 2010 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై 101 పరుగులు సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తరఫున ఇప్పటివరకు మూడంకెల స్కోర్ సాధించిన ఆటగాడు రైనా ఒక్కడే కావడం విశేషం.
వీరి తర్వాత మహేళ జయవర్ధనే (2010లో జింబాబ్వేపై 100), బ్రెండన్ మెక్‌కల్లమ్ (2012లో బంగ్లాదేశ్‌పై 123), అలెక్స్ హేల్స్ (2014లో శ్రీలంకపై 116 నాటౌట్), అహ్మద్ షెహజాద్ (2014లో బంగ్లాదేశ్‌పై 111 నాటౌట్), తమీమ్ ఇక్బాల్ (2016లో ఓమన్‌పై 103 నాటౌట్), క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్‌పై 100 నాటౌట్), జోస్ బట్లర్ (2021లో శ్రీలంకపై 101 నాటౌట్), తాజాగా రిలి రొస్సో టీ20 ప్రపంచకప్‌ల్లో శతకాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment