బౌలర్ ఎవరైనా.. ప్రతి బంతికీ దాడే: గేల్ వార్నింగ్!!
ముంబై: ఓవైపు ఎండలు ప్రచండంగా ఉరుముతున్నాయి.. మరోవైపు అంతే తీవ్రంగా ముంబైలోని వాంఖడే మైదానంలో వెస్టిండీస్ ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. ఓవైపు సహచరుల బౌలింగ్‌లో అండ్రూ రస్సెల్ బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ అందరి దృష్టి క్రిస్ గేల్ మీదనే ఉంది. అప్పటివరకు ప్రాక్టీస్ చేసిన గేల్.. మీడియా రిక్వెస్ట్ మీద కాసేపు వాళ్లతో ముచ్చటించాడు. గురువారం భారత్‌తో జరగబోయే సెమీస్‌లో తాను ఆడాలనుకుంటున్నాడో ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. తన ఫోకస్ అంతా బౌండరీ లైన్ మీదనేనని కుండబద్దలు కొట్టాడు. గేల్ చెలరేగితే ఎలా ఆడుతాడో అందరికీ తెలిసిన విషయమే. సెమీస్‌లోనూ అలా చెలరేగి ఆడటమే తన లక్ష్యమని తేల్చిచెప్పాడు.
'క్రిస్ గేల్ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటాడు. ఏ బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడన్నది ఎప్పుడూ లెక్కచేయడు. క్రిస్ గేల్ ఎప్పుడూ బ్యాటింగ్ దాడిపైనే దృష్టి పెడతాడు. నిజానికి టీ20 క్రికెట్ తీరే అంతా. క్రిస్ గేల్ తీరు కూడా అదే. పేర్లు అనవసరం. క్రికెట్ బంతి మాత్రమే ముఖ్యం. నాకు సాధ్యమైనంతగా దానిని బాదడంపైనే దృష్టిపెడతా' అని గేల్ చెప్పాడు. భారత స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటారు? అన్న ప్రశ్నకు గేల్ ఇచ్చిన సమాధానమిది. వాంఖడే మ్యాచ్‌లో గేల్ పై అశ్విన్ అస్త్రాన్ని ధోనీ ప్రయోగిస్తాడని భావిస్తున్న నేపథ్యంలో.. అశ్వినా.. మరొకరా.. అన్నది లెక్కచేయబోనని గేల్ తేల్చిచెప్పాడు.
'కేవలం అశ్విన్ మీదనే దృష్టి పెట్టకుండా బౌలర్లందరినీ ఎదుర్కోవడానికి నేను మానసికంగా సిద్ధమవుతున్నాను. అశ్విన్ ఓపెనింగ్ బౌలింగ్ చేయడం ఏమంతా ఆశ్చర్యకరం కాదు. అది ఎప్పుడూ జరిగేదే. ధోనీ ఎప్పుడూ అశ్విన్ ను మొదటే వినియోగిస్తాడు' అని చెప్పాడు. 'వాళ్లకు చాలామంది బౌలర్లు ఉన్నారు. నెహ్రా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. కొత్త బాల్‌తో బాగా రాణిస్తున్నాడు. మేం ఒళ్లు దగ్గరపెట్టుకొని కళ్లు తెరిచి పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సి ఉంది' అని గేల్ పేర్కొన్నాడు.