'సత్తెకాలపు' నెహ్రా దుమ్ము రేపుతున్నాడు!
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆశిష్ నెహ్రా పేరు చాలామంది మరిచిపోయి ఉంటారు. కానీ థాంక్స్ టు టీ20!!.. ఊహించనిరీతిలో లేటు వయస్సులోనూ పడిలేచిన కెరటంలా నెహ్రా పైకి వచ్చాడు. ట్వంటీ-20ల్లో అనూహ్యంగా రాణిస్తూ అంతర్జాతీయంగా మళ్లీ పాపులారిటీ తెచ్చుకున్నాడు.
36 ఏళ్ల నెహ్రా సోషల్ మీడియాకు ఆమడ దూరంలో ఉండటంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. అతనిపై 'సత్తెకాలపు సత్తయ్య' (పాతకాలపు మనిషి) అనే ముద్రను వేశాయి. నెహ్రా చాలా అమాయకంగా తనకు సోషల్ మీడియాలో అకౌంట్ కూడా లేదని, ఇప్పటికీ పాత నోకియా ఫోన్నే వాడుతున్నానని, కాబట్టి సోషల్ మీడియా గురించి తననేమీ అడుగొద్దని కోరాడు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెహ్రాను ట్రెండింగ్‌గా మార్చాయి. 'సత్తెకాలపు నెహ్రా' అంటూ చాలామంది సెటైర్లు కూడా వేశారు. 'నెహ్రా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్నాడు. కానీ దానిని అతను చూడలేడు. విడ్డూరమేమిటంటే ఇదే కావచ్చు' అంటూ సహచర క్రికెటర్ రోహిత్ శర్మ కామెంట్ చేశాడు.
సోషల్ మీడియా అంటే నెహ్రాకు నచ్చకపోవచ్చు కానీ,.. సోషల్ మీడియా అంతగా ప్రాచుర్యంలోకి రానినాటినుంచి నెహ్రాపై జోకులు వేయడం భారత క్రికెట్ అభిమానులకు మామూలే. అతను బాగా ఆడినప్పుడు పొగిడిన వాళ్లే.. అతను ఆడనప్పుడు తిట్టారు కూడా. కానీ ఇప్పుడు ఆలస్యంగానైనా పరిస్థితులు నెహ్రాకు బాగా కలిసొచ్చేయనే చెప్పాలి. భారత జట్టులో జహీర్ ఖాన్ వంటి సీనియర్ బౌలర్ లేని సమయంలో అతను కొత్త బంతితో బాగా రాణిస్తున్నాడు. సీనియర్ బౌలర్‌గా ఇటు బుమ్రాకు, అటు పాండ్యకు సూచనలు, సలహాలు ఇస్తూ గురువు పాత్రను పోషిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నెహ్రా ఈ ఇద్దరికి సూచనలు ఇస్తూ కనిపించాడు.
ఇక బౌలింగ్‌లోనూ నెహ్రా బాగానే రాణిస్తున్నాడు. టీ20 వరల్ కప్‌లో ఇప్పటివరకు సగటున ఓవర్‌కు తక్కువ పరుగులు ఇచ్చిన పొదుపైన బౌలర్‌గా నెహ్రా ప్రథమస్థానంలో ఉన్నాడు. ఓవర్‌కు 5.93 సగటు పరుగులతో పొదుపైన బౌలర్‌గా ద్వేన్ బ్రేవో, ముస్తాఫిజుర్ రహ్మాన్‌లను వెనక్కి నెట్టేశాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ ఆశలు నిలబెట్టింది నెహ్రానే. ఈ మ్యాచ్‌లో అతను పొదుపైన బౌలింగ్ చేయడమే కాదు.. ప్రమాదకరమైన ఉస్మాన్ ఖావాజాను ఔట్ చేశాడు. ఈ రెండు జరిగి ఉండకపోతే భారత్ ముందు కొండంత లక్ష్యం ఉండేది. ఈ మ్యాచ్‌లో మొదటి బంతుల్లో 11 డాట్ బాల్స్ వేసిన నెహ్రా ఓవరాల్‌గా 13 డాట్ బాల్స్ వేశాడు. తన కోహ్లి కళాత్మక విధ్వంసంతో ఈ మ్యాచ్ క్రెడిట్‌ను పూర్తిగా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నా.. కెప్టెన్ ధోనీ మాత్రం నెహ్రా నైపుణ్యాన్ని కూడా కొనియాడాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా మంచి బౌలింగ్‌ను నెహ్రా వేశాడని మెచ్చుకున్నాడు.