
Rohit Sharma- Virat Kohli: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యంపై మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వారిద్దరు ఇంకొన్నాళ్లు పొట్టి ఫార్మాట్లో కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది ప్రపంచకప్-2022 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
గత సీజన్‌లో ఐపీఎల్ ఆడిన ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు.. టీమిండియా తరఫున మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ సీనియర్ ప్లేయర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న వరల్డ్‌కప్‌నకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు.
అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై?
ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత.. 36 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. 35 ఏళ్ల కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ వదంతులపై ఆశిష్ నెహ్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒక క్యాలెండర్ ఇయర్‌లో విరాట్ కోహ్లి 800- 1000 పరుగులు చేస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే ఏ సెలక్టర్ అయినా అతడి ఎంపిక విషయంలో టెంప్ట్ కాకుండా ఎలా ఉంటాడు?
వాళ్లిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప
కోహ్లి, రోహిత్ ఈ ఫార్మాట్లో కొనసాగుతారో లేదో తెలియదు కానీ.. రెస్ట్ తీసుకోవాలని మాత్రం భావిస్తున్నారని చెప్పవచ్చు. తమకు తాముగా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప.. వాళ్లను దూరం పెట్టే ప్రసక్తే లేదు. వాళ్లిద్దరు ఇంకొన్నాళ్లు పొట్టి ఫార్మాట్లో కొనసాగే సత్తా ఉన్న వాళ్లే’’ అని ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు.
వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్ ఆరంభం సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక రోహిత్ శర్మ గైర్హాజరీ, హార్దిక్ పాండ్యా గాయం నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తొలిసారి భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన తొలి టీ20లో సూర్య సేన 2 వికెట్ల తేడాతో గెలిచింది.
చదవండి: యూట్యూబర్‌ను పెళ్లాడిన టీమిండియా పేసర్.. సిరాజ్ విషెస్
Comments
Please login to add a commentAdd a comment