ఆ బౌలర్‌కు టీమ్‌లో చోటు కష్టమే: ధోనీ
మీర్‌పూర్: టీ-20 వరల్డ్ కప్ సందర్భంగా బెంగాల్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ షమీకి టీమిండియాలో చోటు దొరకడం కష్టమేననిపిస్తోంది. గాయంతో జట్టు నుంచి వైదొలిగిన అతడు ఒకవేళ ఫిట్‌నెస్ నిరూపించకున్నా.. మళ్లీ టీమ్‌లోకి తీసుకోవడం కష్టమని, ప్రస్తుతం చక్కగా రాణిస్తున్న జస్ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రాల్లో ఎవరి స్థానంలోనూ అతన్ని జట్టులోకి తీసుకోలేమని టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్పష్టం చేశాడు. ప్రసుతం జట్టు మంచి సమతుల్యంతో ఉందని, కాబట్టి జట్టు కూర్పులో మార్పులు అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
'షమీ ఫిట్‌గా ఉన్నాడా లేదా అన్నది ఇంకా మాకు తెలియదు. అతనికి మరింత సమయం అవసరమవుతుందని భావిస్తున్నాను. షమీ కొత్త బంతితోనైనా, పాత బంతితోనైనా అద్భుతంగా యార్కర్లు సంధించగలడు. కానీ బూమ్రా స్థానంలో అతన్ని జట్టులోకి తీసుకోలేం. ఎందుకంటే బుమ్రా కొత్తబంతిగా బాగా రాణిస్తున్నాడు' అని ధోనీ చెప్పాడు.
'హర్దిక్ పాండ్యా మంచి ఆల్ రౌండర్. జడ్డేజా లేదా అతడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలరు. మూడు- నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలరు. ఇక మిగిలింది ఆశిష్ నెహ్రా. అతని స్థానంలో షమీని తీసుకోవడం కష్టం. ఎందుకంటే నెహ్రా ఇటీవల జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. బంతికి అనుగుణంగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు' అని ధోనీ స్పష్టం చేశాడు.