
3 సిస్టర్స్ 3 ఛీర్స్
ఒలింపిక్స్‌లో ఒక కుటుంబంనుంచి ఒకరు పాల్గొంటేనే పెద్ద సంబరం... అదే ఇద్దరు అయితే దానిని అద్భుతంగా చెప్పవచ్చు... ఇక ఒక ఫ్యామిలీలో ఒకేసారి పుట్టిన, ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు ఒకేసారి ట్రాక్‌పై పరుగెడుతుంటే చూడటానికి ఎన్ని కనులు కావాలి? అదీ ఆ ముగ్గురు మూడు పదుల మహిళలు అయితే దానిని మహాద్భుతంగానే వర్ణించాలి. ఇలాంటి కలల దృశ్యం రియో ఒలింపిక్స్‌లో సాక్షాత్కరించే అవకాశం ఉంది. ఎస్తోనియా దేశపు అక్కాచెల్లెళ్లు తొలిసారి ఈ స్వప్నాన్ని నిజం చేయబోతున్నారు.
* ఎస్తోనియా సోదరీమణుల అరుదైన ఘనత
* ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే సారి బరిలోకి
* రియో ఒలింపిక్స్‌లో ‘స్పెషల్’ సిస్టర్స్
ఆ ముగ్గురు ఒకే సమయంలో పుట్టిన సొంత అక్కాచెల్లెళ్లు. రూపురేఖల మొదలు కట్టు బొట్టూ అన్నీ ఒకలాగే. కవలలకంటే వారు ‘ఒక ఆకు’ ఎక్కువే చదివారు. అందుకే చిన్నప్పటినుంచి ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ముగ్గురమొకటై మరో జగం... అంటూ ఆడి పాడారు. అలాంటి ఆటల్లోనే వారు పరుగు నేర్చారు.
ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. ఇలాంటి ఉత్సాహంలో ఈ పరుగేదో బాగుందనిపించింది. అంతే... సీరియస్‌గా పరుగెత్తాలని ఒట్టేసుకున్నారు. ఆటల గురించి మరచిపోయి సంసారాల్లో బిజీగా మారిపోయే 24 ఏళ్ల వయసులో వారు తొలిసారి పోటీల్లో పరుగెత్తారు. రైలు బండిలా ఒకరి తర్వాత మరొకరికి ఇలా వరుసగా మూడు స్థానాలు దక్కాయి. ఈ సమయంలోనే వీరిని చూసిన హ్యరీ లాంబర్గ్ అనే కోచ్ ఈ పరుగు ‘మూన్నాళ్ల’ ముచ్చగా మిగిలిపోవద్దంటూ నేను శిక్షణ ఇస్తానంటూ ముందుకొచ్చాడు. కట్ చేస్తే...లీలా, లీనా, లిలీ (ల్యూక్ సిస్టర్స్) రియో ఒలింపిక్స్‌లో మారథాన్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించేశారు. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో 200 మంది కవలలు పాల్గొన్నా... ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు మాత్రం ఎప్పుడూ బరిలోకి దిగలేదు. ఇప్పుడు ఎస్తోనియా సిస్టర్స్ కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు.
మారథాన్ వైపు...
ఈ ముగ్గురు సోదరీమణులు అథ్లెటిక్స్ ప్రారంభించాక తమకు స్ప్రింట్స్‌కంటే లాంగ్ డిస్టెన్స్ పరుగు బాగా సరిపోతుందని భావించారు. అందుకే దానిపైనే దృష్టి పెట్టి మారథాన్‌లో ప్రతిభను ప్రదర్శించారు. ముందుగా జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు వచ్చాక యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని ఆకట్టుకున్నారు. ఇదే జోరులో వారు ఒలింపిక్స్ లక్ష్యంగా తీవ్రంగా శ్రమించారు. టార్టు నగరానికి చెందిన ఈ త్రయం ‘ట్రయో ఫర్ రియో’ అనే టీమ్ పేరుతో బరిలోకి దిగి రియోకు క్వాలిఫై అయ్యారు.
ఎస్తోనియాలో వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉండే వీరంతా ప్రాక్టీస్ సమయంలో మాత్రం ఒకే చోటికి చేరతారు. సాధన సమయంలో కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, తప్పులు సరిదిద్దు కోవడం ఈ సిస్టర్స్‌కు రొటీన్. కెన్యా కొండల్లో రియో కోసం కలిసే సిద్ధమయ్యారు. ఒంటరిగా ప్రాక్టీస్ చేయడం చాలా బోరని చెప్పే వీరు... ప్రతీ రేస్‌లో అప్పటికి టాప్‌లో ఉన్న సోదరి టైమింగ్‌ను దాటడం లక్ష్యంగా పెట్టుకుంటారు!
పతకం కష్టమే
ఎస్తోనియా తరఫున మారథాన్‌లో మూడు బెర్త్‌లు ఉండగా ఈ ముగ్గురే అర్హత సాధించారు. కాబట్టి రియో వేదికపై కూడా అంతా కలిసి పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఆ దేశపు స్థాయిలో టాప్ అథ్లెట్లే అయినా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వీరు చాలా దూరంలో ఉన్నారు. వీరిలో అత్యుత్తమమైన లీలా టైమింగ్ 2 గంటల 37.12నిమిషాలు ఒలింపిక్ రికార్డుకంటే 15 నిమిషాలు ఎక్కువ! ఆ తర్వాత రెండున్నర నిమిషాలు ఎక్కువగా లీనా ఉండగా, మరో 45 సెకన్లు ఆలస్యంగా లిలీ టైమింగ్ ఉంది. కాబట్టి ఎలా చూసినా ఆఫ్రికన్ అథ్లెట్లతో పోటీ పడే సత్తా కనిపించడం లేదు. అయితే ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశమంత ఉన్న ఈ సిస్టర్స్ ‘ఏమో, సాధిస్తామేమో, మా ప్రయత్నం అయితే చేస్తాం’ అని ఏకకంఠంతో చెబుతున్నారు. పతకం దక్కకపోయినా...ఈ సూపర్ త్రీ సిస్టర్స్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
- సాక్షి క్రీడా విభాగం