వన్డేకు భద్రత కట్టుదిట్టం
ఉప్పల్: రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆదివారం భారత్, శ్రీలంక మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మ్యాచ్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను వెల్లడించారు. 1500 మంది పోలీస్ సిబ్బంది, బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్‌తో పాటు పరిసరాల్లో 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను మరింత పటిష్టం చేసినట్లు చెప్పారు.
మ్యాచ్ సమయంలో ప్రేక్షకులు మైదానంలోకి సెల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగ్‌లు, తినుబండారాలవంటి ఎలాంటి వస్తువులు తీసుకు రావద్దని కమిషనర్ సూచించారు. మ్యాచ్ సందర్భంగా వాహనాల పార్కింగ్ వివరాలను కూడా ఆయన ప్రకటించారు. మెట్రో పనులు జరుగుతున్న దృష్ట్యా హబ్సిగూడ టు ఉప్పల్ రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి పార్కింగ్‌కు అనుమతి లేదని చెప్పారు. హబ్సిగూడ వైపు వచ్చే భారీ వాహనాలకు, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపునకు, ఎల్బీనగర్‌నుంచి హబ్సిగూడ, ఉప్పల్ నుంచి హ బ్సిగూడ వెళ్లే మార్గంలో భారీ వాహనాలకు కూడా మ్యాచ్ రోజున అనుమతి లేదని తెలిపారు.
పార్కింగ్ ప్రాంతాలు ఇవే...
గేట్-2, గేట్-3 అండ్ గేట్ -11 ద్వారా వెళ్లేవారు రామంతాపూర్ రోడ్డుకు ఇరువైపులా తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు.
వికలాంగులు, గేట్-3 ద్వారా స్టేడియంలోకి వెళ్లేవారు రామంతాపూర్ రోడ్డులోనే పార్కు చేసుకోవాలి.
ప్రత్యేక పార్కింగ్ కు అనుమతి ఉన్న వారు, గేట్ -4 అండ్ 9 ద్వారా వెళ్లేవారు హబ్సిగూడ నుంచి ఏక్ మినార్ మజీద్ ద్వారా ప్రవేశించాలి.
కాంప్లిమెంటరీ పాస్‌లు ఉన్నవారు రామంతాపూర్ రోడ్డులో ఎల్జీ గోడౌన్ ప్రాంతంలో పార్కింగ్ చేసుకోవాలి.