అందుకే ఓడాం : ఆసీస్‌ కెప్టెన్‌ | Tim Paine Says Our Top-6 is Pretty Inexperienced | Sakshi
Sakshi News home page

అనుభవరాహిత్యమే మా కొంపముంచింది: టిమ్‌ పైన్‌

Published Sun, Dec 30 2018 11:03 AM | Last Updated on Sun, Dec 30 2018 12:53 PM

Tim Paine Says Our Top-6 is Pretty Inexperienced - Sakshi

టిమ్‌ పైన్‌

మెల్‌బోర్న్‌ : భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఓటమికి బ్యాట్స్‌మెన్‌ అనుభవరాహిత్యమే కారణమని ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి కొంచెం నిరాశను కలిగించింది. పెర్త్‌ విజయం పునరావృతం అవుతుందని భావించాను. కానీ బ్యాటింగ్‌ లైనప్‌ అనుభవరాహిత్యం మా కొంపముంచింది. ప్రపంచ దిగ్గజ పేస్‌ అటాక్‌ ఉన్న జట్టుతో ఆడుతున్నాం. కానీ మా జట్టులో టాప్‌-6 బ్యాట్స్‌మెన్‌ అనుభవం లేనివారే. మా తప్పిదాలను తెలుసుకొని ముందుకు సాగుతాం. మా ఆటగాళ్లు వారి శక్తి మేరకు కష్టపడ్డారు. సిడ్నీ టెస్ట్‌ మాకో పెద్ద చాలెంజ్‌. ఈ మ్యాచ్‌లో తప్పక విజయం సాధించి.. సిరీస్‌ను కాపాడుకుంటాం. మా బ్యాటింగ్‌ ఆర్డర్‌పై మరోసారి సమాలోచనలు జరుపుతాం.

సిడ్నీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌దే పూర్తి క్రెడిట్‌. వారు అద్భుతంగా ఆడారు. ప్యాట్‌ కమిన్స్‌ ఇన్నింగ్స్‌ అద్భుతం. అతనో​ నాణ్యమైన ఆటగాడు. ఈ సిరీస్‌ అసాంతం అతను అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతనిలా రాణించే ఆటగాళ్లు కావాలి. ఒక్క విషయంలో తప్ప ఈ ఏడాది బాగానే గడిచింది. వచ్చే ఏడాది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులోకి రాబోతున్నారు. ఇది ఆసీస్‌ జట్టుకు కలిసొచ్చే అంశం.’ అని పైన్‌ చెప్పుకొచ్చాడు. మూడో టెస్ట్‌లో భారత్‌ 137 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే.

ఆధిపత్యాన్ని చలాయిస్తాం: కోహ్లి
ఈ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘సిరీస్‌లో మా ఆధిపత్యాన్ని ఇక్కడితో ఆపదల్చుకోలేదు. ఈ విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కాబట్టి.. రెట్టించిన ఉత్సాహంతో సిడ్నీ టెస్టులో ఆడతాం. సిరీస్‌లో గెలిచిన రెండు టెస్టుల్లోనూ భారత్ జట్టు అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించింది. అయితే.. ఆస్ట్రేలియా గడ్డపై మా పని ఇంకా ముగియలేదు. ఆఖరి టెస్టులో విజయం సాధించాలి. ఆ మ్యాచ్‌లో గెలిచేందుకు ఏ అవకాశం లభించినా.. చేజార్చుకోం. కచ్చితంగా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయిస్తాం’ అని విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు. చివరి టెస్ట్‌ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను భారత్‌ కాపాడుకుంటే సిరీస్‌ భారత్‌ వశం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement