బెంగళూరు: టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలతో నిషేధం ఎదుర్కొన్న లోకేశ్ రాహుల్ ఆ ఘటన తనలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని అన్నాడు. ఆ సమయంలో ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టినట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టి20ల్లో రాహుల్ 50, 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. విరామం సందర్భంగా బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వద్ద తగిన సూచనలు తీసుకున్నట్లు అతను వెల్లడించాడు. ‘ఆటగాడిగా, వ్యక్తిగతంగా కూడా అది నాకు చాలా కఠిన సమయం.
టీవీ షో తర్వాతి పరిణామాలు నన్ను ఎంతో మార్చేశాయి. మరింత వినయంగా, సంయమనంగా ఉండటం ఎలాగో నేర్చుకున్నాను. దేశం తరఫున ఆడే అవకాశం రావడం గొప్ప విషయం. ఇకపై తలవంచుకొని ఆటపై మాత్రమే దృష్టి పెడతాను. నిషేధం కారణంగా లభించిన సమయంలో నా ఆటలో లోపాలు అధిగమించే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా ద్రవిడ్‌తో గడిపిన సమయం ఎంతో ఉపయోగపడింది. ఇకపై వ్యక్తిగా మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తా’ అని రాహుల్ పేర్కొన్నాడు. గురువారం ప్రకటించిన ఐసీసీ టి20 బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో రాహుల్ ఆరో స్థానంలో నిలిచాడు. భారత్‌నుంచి టాప్–10లో అతనొక్కడే ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment