వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వచ్చే ఏడాది జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. దానికి ముందు అన్ని అస్త్రశస్త్రాలు పరీక్షించుకునేందుకు, ప్రణాళికలు, ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకునేందుకు మరో 18 వన్డేల సమయం ఉంది. వరల్డ్ కప్ వేదికలు, వాతావరణాల్లో తేడా ఉన్నా జట్టు కూర్పు, సన్నద్ధతవంటి అంశాలపై ఈ మ్యాచ్‌ల్లో మరింత స్పష్టత రానుంది. ఈ క్రమంలో ఇద్దరు ప్రధాన పేసర్లు మినహా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతున్న భారత్ టెస్టు సిరీస్‌లాగే వన్డేల్లోనూ తమ పదును చూపించాలని పట్టుదలగా ఉంది.
క్రిస్ గేల్ లేడు. రసెల్ రాలేదు. భారత్‌పై టి20ల్లో రెండు సెంచరీలు బాదిన లూయీస్ రాలేనన్నాడు. చివరకు టెస్టుల్లోనే చచ్చీ చెడి బ్యాటింగ్ చేసిన సగం లైనప్‌తోనే వెస్టిండీస్ వన్డేలు కూడా ఆడాల్సిన పరిస్థితి. భారత్‌తో ఏ రకంగా పోల్చుకున్నా బలహీనంగా కనిపిస్తున్న విండీస్ ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటుదనేదే సమస్య. ముఖ్యంగా 30 ఓవర్ల స్పిన్‌ను ఆడటం వారికి శక్తికి మించిన పనే కావచ్చు. అయితే భారత గడ్డపై వన్డేల్లో ఒక్కసారి కూడా క్లీన్‌స్వీప్ కాని రికార్డు విండీస్‌కు కొంత ప్రేరణ అందిస్తే టెస్టులతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది.
గువాహటి: వెస్టిండీస్‌పై టెస్టుల్లో ఘన విజయం తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ తమ జోరు కొనసాగించేందుకు భారత జట్టు సన్నద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ జరిగే తొలి మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. బలాబలాల పరంగా భారత్ అందనంత ఎత్తులో నిలిచినా... కొంత మేరకు పోటీనివ్వగల స్థితిలో విండీస్ కనిపిస్తోంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందే శనివారం భారత్ 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. తొలిసారి వన్డే జట్టులోకి ఎంపికైన రిషభ్ పంత్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా వన్డేల్లోనూ అరంగేట్రం చేయడం ఖాయమైపోయింది. ఫలితంగా మనీశ్ పాండే, కేఎల్ రాహుల్ పెవిలియన్‌కే పరిమితం అవుతున్నారు.
ధోనిపై ఒత్తిడి...
ఆసియా కప్‌లో 4 ఇన్నింగ్స్‌లలో కలిపి ధోని చేసిన పరుగులు 77... 2018లో మొత్తం 10 ఇన్నింగ్స్‌లలో అతని సగటు 28.12 మాత్రమే... భారత జట్టుకు సంబంధించి ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. దిగ్గజ ఆటగాడు, అనుభవం దృష్ట్యా అతడిని పక్కనైతే పెట్టలేరు, ఆడించక తప్పదు... పైగా ‘ప్రధాన వికెట్ కీపర్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు’ అంటూ పంత్ ఎంపిక సమయంలో చీఫ్ సెలక్టర్ కూడా ధోనికి మద్దతుగా నిలిచాడు. అయితే ఇప్పుడు ధోని తన స్థాయిని ప్రదర్శించేందుకు ఇంతకంటే సరైన సమయం రాదు. టాప్–3 రోహిత్, ధావన్, కోహ్లి అద్భుతంగా ఆడుతుండటంతో జట్టుకు పెద్దగా ఇబ్బంది ఎదురు కావడం లేదు. కానీ మిడిలార్డర్‌లో ధోని మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. ఇక ముగ్గురు స్పిన్నర్లు చహల్, కుల్దీప్, జడేజాలు విండీస్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టగలరు. ఈ ముగ్గురి ఓవర్లే మ్యాచ్‌ను ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. చాలా కాలంగా నాలుగో స్థానం విషయంలో అనిశ్చితి కొనసాగినా... ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లి వ్యాఖ్యలను బట్టి చూస్తే అంబటి తిరుపతి రాయుడు తన స్థానాన్ని దాదాపుగా పటిష్టం చేసుకున్నట్లే కనిపిస్తోంది. మనీశ్ పాండే, రాహుల్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ నమ్మకం కోల్పోయిందనడానికి ముందు రోజే ప్రకటించిన 12 మంది సభ్యుల జట్టే ఉదాహరణ. ధోని వికెట్ కీపర్‌గా జట్టులో ఉన్నా... టెస్టుల్లో అద్భుత ప్రదర్శన తర్వాత ఇప్పుడు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా రిషభ్ పంత్ వన్డేల్లోకి అరంగేట్రం చేయనుండటం విశేషం. తొలి మ్యాచ్‌లో ఇద్దరు ప్రధాన పేసర్లు షమీ, ఉమేశ్‌లకే అవకాశం దక్కవచ్చు.
గెలిపించేవారున్నారా..!
భారత గడ్డపై మెరుగైన ప్రదర్శన కనబరిచిన వెస్టిండీస్ ఆటగాళ్లలో మార్లోన్ శామ్యూల్స్ ఒకడు. అతను ఇక్కడ ఆడిన 30 వన్డేల్లో భారత్‌పైనే మూడు సెంచరీలు చేశాడు. 199 వన్డేల్లో అత్యద్భుత రికార్డు ఏమీ లేకపోయినా... ఉన్నంతలో అతనే జట్టులో అనుభవజ్ఞుడు. పైగా స్పిన్‌ను కాస్త సమర్థంగా ఆడగలడు. శామ్యూల్స్‌లో పాటు కెప్టెన్ జేసన్ హోల్డర్‌పై జట్టు కాస్త ఆశలు పెట్టుకోవచ్చు. ఆటతో పాటు పట్టుదల, పోరాటతత్వం ఉన్న హోల్డర్ రాణిస్తే జట్టు విజయావకాశాలు మెరుగవుతాయి. వీరిద్దరు మినహా విండీస్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు. టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఆంబ్రిస్, కీరన్ పావెల్, షై హోప్, హెట్‌మెయిర్, కీమో పాల్, బిషూలాంటి ఆటగాళ్లే వన్డే తుది జట్టులో ఆడే అవకాశం ఉండటం ఆ జట్టు దైన్యం. కొందరు టి20ల్లో హిట్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లాంటి చోట మెరిసినా... వన్డేల్లో ఎంత సేపు నిలబడగలరనేది సందేహమే. పైగా భారత స్పిన్‌ను ఆడటం వారికి శక్తికి మించిన పనే కావచ్చు. ఐసీసీ నిషేధంతో కోచ్ స్టువర్ట్ లా మార్గనిర్దేశనం కూడా దూరమైన నేపథ్యంలో విండీస్ జట్టు ఎలాంటి వ్యూహంతో ఆడుతుందో చూడాలి.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాయుడు, పంత్, ధోని, జడేజా, కుల్దీప్, చహల్, ఉమేశ్, షమీ.
వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), ఆంబ్రిస్, కీరన్ పావెల్, షై హోప్, హెట్‌మెయిర్, శామ్యూల్స్, రోవ్‌మన్ పావెల్, ఆష్లే నర్స్, కీమో పాల్, బిషూ, అల్‌జారి జోసెఫ్/ కీమర్ రోచ్.
పిచ్, వాతావరణం
బర్సపర మైదానంలో ఇదే తొలి వన్డే మ్యాచ్. ఏడాది క్రితం జరిగిన టి20 మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు భారత్‌పై చెలరేగారు. ఇప్పుడు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినట్లు చెబుతున్నారు. ఈశాన్యంలో శీతాకాలం ఆరంభమైపోవడంతో మంచు ప్రభావం ఖాయం. టాస్ గెలిచే జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
►విరాట్ కోహ్లి మరో 221 పరుగులు చేస్తే వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయి దాటిన ఐదో భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు.
►2015 ప్రపంచ కప్ తర్వాత స్పిన్నర్ల బౌలింగ్‌లో అతి తక్కువ రన్‌రేట్ (3.97)తో పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధోని మూడో స్థానంలో ఉన్నాడు. అయితే అతనికంటే ముందు బారింగ్టన్ (స్కాట్లాండ్), షాహిది (అఫ్గానిస్తాన్)లాంటి చిన్న జట్ల ఆటగాళ్లు మాత్రమే ఉండటం ధోని బలహీనతను సూచిస్తోంది.
►మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment