ఆఖరి సన్నాహకం!
నేడు భారత్ రెండో వార్మప్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో పోరు ‘తుది’ జట్టు బరిలోకి దిగే అవకాశం
ముంబై: ఈ ఏడాది ఆడిన 11 టి20 మ్యాచ్‌లలో 10 విజయాలను సాధించిన భారత్ జోరు కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో మొదలుపెట్టి శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వరకు ప్రత్యర్థి ఎవరైనా ధోని సేన విజయయాత్రకు అడ్డు ఉండటం లేదు. అయితే ఈ దూకుడుకు కాస్త ముందు దక్షిణాఫ్రికా మనకు పరాభవం మిగిల్చింది. అదీ సొంతగడ్డపై 0-2తో ఓడిన తీరు అటు ఆటగాళ్లు, ఇటు అభిమానులు కూడా మరచిపోలేదు. ఇప్పుడు ప్రపంచకప్‌కు ముందు ఆ జట్టుతో మరోసారి తలపడే అవకాశం వచ్చింది. పేరుకు వార్మప్ మ్యాచే అయినా, జట్ల బలాబలాలను పరిశీలిస్తే హోరాహోరీ పోరు సాగవచ్చు. వరుసగా టి20 మ్యాచ్‌లే ఆడి కావాల్సినంత సన్నాహాలు చేసుకున్న టీమిండియాకు... మంగళవారం కివీస్‌తో జరిగే ప్రధాన టోర్నీ తొలి మ్యాచ్‌కు ముందు ఇదే ఆఖరి ప్రాక్టీస్. భారత్ ఆడిన తొలి మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్స్‌లో దాదాపు 25 వేల ప్రేక్షకులు హాజరు కావడం చూస్తే ఫ్యాన్స్, ప్రాక్టీస్ మ్యాచ్‌లను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారని అర్థమవుతుంది.
రైనా ఫామ్‌లోకొచ్చేనా!
భారత బ్యాటింగ్‌కు సంబంధించి కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, రోహిత్ శర్మ కూడా అదరగొడుతున్నాడు. ఇక ఆసియా కప్ ఫైనల్‌తో ధావన్‌పై కూడా నమ్మకం పెరిగింది. చివర్లో హిట్టింగ్ చేసే ధోని గురించి ఆందోళన లేకపోగా, యువరాజ్ కూడా నిల దొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు కాస్త ఇబ్బంది పెడుతున్న అంశం సురేశ్ రైనా బ్యాటింగ్. ప్రధాన బ్యాట్స్‌మెన్‌లలో అతను మాత్రమే కాస్త తడబడుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణించిన అతను శ్రీలంకతో సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. ఆసియా కప్‌లో రెండుసార్లు బ్యాటింగ్ అవకాశం రాకపోగా... రెండింటిలో విఫలమై, ఒక్క లంకతో మాత్రం అతి కష్టమ్మీద కొన్ని పరుగులు చేయగలిగాడు. వెస్టిండీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చి ఒకే బంతి ఎదుర్కోవడం అతనికి పెద్దగా పనికి రాలేదు. ఇప్పుడు తన బ్యాట్‌కు పదును పెట్టేందుకు రైనాకు ఇదే సరైన సమయం.
ఇక్కడ రాణించి ఫామ్‌లోకి వస్తే అసలు పోరులో అతని గురించి ఆందోళన ఉండదు. గత మ్యాచ్‌లో రహానే, నేగిలకు అవకాశం ఇచ్చినా, ఈ వార్మప్‌లో అసలైన తుది 11 మందినే ఆడించే అవకాశం ఉంది. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు ఇదే బృందంతో ఫలితం సాధించడంపై జట్టు దృష్టి పెట్టింది. బౌలింగ్‌లో కూడా అంతా ఊహించినట్లే ఉన్నా... షమీ పునరాగమనంతో ఆ ఒక్క స్థానం విషయంలో అస్పష్టత నెలకొంది. పూర్తి ఫిట్‌నెస్‌ను అందుకునే ప్రయత్నంలో ఉన్న షమీని సిద్ధం చేసేందుకు ధోని అతనికే అవకాశం ఇవ్వవచ్చు.
సఫారీలు సిద్ధం...
సొంతగడ్డపై 1-2తో ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ ఓడిన అనంతరం భారత్ చేరిన దక్షిణాఫ్రికా తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆ జట్టు కూడా ఎక్కువ ప్రయోగాలకు పోకుండా ఇటీవలి మ్యాచ్ ఆడిన తుది జట్టునే ఆడించవచ్చు. కెప్టెన్ డు ప్లెసిస్, డివిలియర్స్, డి కాక్, మిల్లర్‌లాంటి హిట్టర్లకు తోడు ఆమ్లా కూడా మంచి ఫామ్‌లో ఉండటంతో సఫారీల బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో స్టెయిన్, రబడ, అబాట్‌లపై జట్టు ఆ జట్టు ఆధారపడుతోంది. అయితే ఐపీఎల్ అనుభవంతో రాటుదేలిన ఆల్‌రౌండర్లు డుమిని, మోరిస్, వీస్ కీలకం కానున్నారు. వీరిలో దాదాపు అందరికీ భారత్‌లో ఆడిన అనుభవం ఉండటం ఆ జట్టుకు అనుకూలాంశం.