ఇండోర్: ప్రత్యర్థిపై పైచేయి ఎలాగూ ఉంది... ఓడితే సిరీస్ పోతుందేమోనన్న భయం లేదు... జట్టు అన్ని విభాగాల్లో సమతూకంతో పటిష్ఠంగా ఉంది... మిగిలిందల్లా మరో విజయంతో ముందడుగు వేయడమే...! శ్రీలంకతో శుక్రవారం ఇండోర్‌లో జరగనున్న రెండో టి20కి ముందు భారత జట్టు పరిస్థితిది. కటక్‌లో తొలి టి20లో సంపూర్ణ ఆధిపత్యం చాటి భారీ గెలుపును ఖాతాలో వేసుకున్న టీమిండియా అదే జోరును కొనసాగిస్తే తిరుగుండదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో ఇక్కడే ఒడిసిపట్టేయొచ్చు.
‘ఓపెనింగ్’ కుదిరింది...
పెద్దగా మార్పులకు తావివ్వకుండానే తొలి 20లో భారత్ అదరగొట్టింది. కెప్టెన్ రోహిత్‌కు తోడుగా వచ్చిన కేఎల్ రాహుల్ అర్ధ శతకంతో పటిష్ట పునాది వేశాడు. తన ఇన్నింగ్స్‌లో దూకుడు, సంయమనం రెండింటినీ చూపాడు. దీంతో కీలకమైన రెండో ఓపెనర్ ఎవరనేది స్పష్టమైపోయింది. శుక్రవారం మ్యాచ్‌లోనూ వీరే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. పరిస్థితికి తగ్గట్లు ఆడుతూ వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. ఎప్పటినుంచో చర్చకు తావిస్తున్న ‘నాలుగో స్థానం’లో వచ్చిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన విలువేంటో చాటాడు. అతడికి మనీశ్‌పాండే తోడవడంతో కటక్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇండోర్‌లోనూ ఇదే ఆర్డర్‌ను కొనసాగించవచ్చు. ఓవర్లు మరీ తక్కువగా ఉండి... భారీ హిట్టింగ్ చేయాల్సి వస్తే హార్దిక్ పాండ్యాను ముందుగా పంపే ఆలోచన చేయొచ్చు. స్పిన్ ద్వయం చహల్, కుల్దీప్ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రత్యర్థి ఎదురుదాడికి దిగినా వెరవకుండా బౌలింగ్ చేస్తున్నారు. వీరిని ఎదుర్కొనే సంగతి అటుంచి కనీసం వికెట్ కాపాడుకోవడమూ లంక ఆటగాళ్లకు సాధ్యం కావడం లేదు. తొలి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసినా ఆటగాళ్లందరినీ పరీక్షించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తే ఉనాద్కట్ స్థానంలో బాసిల్ థంపి అరంగేట్రం చేయొచ్చు.
లంక... లుకలుక..
శ్రీలంక ఆటతీరు కటక్‌లో మరీ తీసికట్టుగా సాగింది. ఏ విభాగంలోనూ భారత్‌కు సమ ఉజ్జీగా నిలవలేకపోయింది. ఓపెనింగ్‌లో డిక్‌వెలా, తరంగ ఫర్వాలేదనుకున్నా... తర్వాత నడిపించేవారు కనిపించడం లేదు. సీనియర్ మాథ్యూస్ బంతితో ఆకట్టుకుని బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ధాటిగా ఆడాల్సిన వన్‌డౌన్‌కు కుషాల్ పెరీరా న్యాయం చేయలేకపోయాడు. గుణరత్నే, కెప్టెన్ తిసారా పెరీరా పేరుకు మాత్రమే అన్నట్లున్నారు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ షనకను కెప్టెన్ కంటే ముందు పంపినా ఫలితం లేకపోయింది. అతడిని బౌలింగ్‌లోనూ ఉపయోగించుకోలేదు. తొలి మ్యాచ్‌లో మాథ్యూస్, అకిల ధనంజయ మినహా.. మిగతా వారి బౌలింగ్‌ను భారత్ బ్యాట్స్‌మెన్ అలవోకగా ఎదుర్కొన్నారు. చమీర, నువాన్ ప్రదీప్ 17, 19 ఓవర్లలో ఏకంగా 40 పరుగులివ్వడం మ్యాచ్ గతినే మార్చేసింది. ఇండోర్‌లో లంక కూడా ఒక మార్పుతో దిగనున్నట్లు తెలుస్తోంది. లెఫ్టార్మ్ పేసర్ విశ్వ ఫెర్నాండో స్థానంలో బ్యాట్స్‌మన్ సమరవిక్రమను తుది జట్టులోకి తీసుకోనున్నారు. జట్టుగా ఆడటంతో పాటు ఒకట్రెండు అత్యుత్తమ ప్రదర్శనలు చేస్తేనే లంక భారత్‌ను ఓడించగలదు.
పిచ్, వాతావరణం
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం బ్యాట్స్‌మన్ స్వర్గధామంగా పేరుగాంచింది. ఇక్కడ బౌండరీ పరిధి కూడా తక్కువే. మధ్య భారత్‌లోని వేదిక కాబట్టి మంచు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వాతావరణ పరిస్థితుల రీత్యా వర్షం కురిసే అవకాశాలు తక్కువే.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్‌శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోని, శ్రేయస్ అయ్యర్, మనీశ్‌పాండే, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, బాసిల్ థంపి
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), డిక్‌వెలా, తరంగ, మాథ్యూస్, కుషాల్ పెరీరా, సమరవిక్రమ, గుణరత్నే, షనక, అకిల ధనంజయ, చమీర, ప్రదీప్
Comments
Please login to add a commentAdd a comment