కావాలి... ‘విజయ’ దశమి | Today, with South Africa in the fourth ODI | Sakshi
Sakshi News home page

కావాలి... ‘విజయ’ దశమి

Published Thu, Oct 22 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

కావాలి... ‘విజయ’ దశమి

కావాలి... ‘విజయ’ దశమి

నేడు దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డే
భారత్‌కు చావోరేవో    
సిరీస్‌పై సఫారీల దృష్టి

 
దేశమంతా నేడు పండగ. గొప్ప విజయాన్ని ఆస్వాదించే సంబరం. మరి క్రికెట్ ను ఆరాధించే అభిమానుల సంగతేంటి..? దక్షిణాఫ్రికా జట్టు మన గడ్డపై అడుగుపెట్టిన దగ్గర్నించి భారత క్రికెటర్లు విజయం కోసం ఆపసోపాలు పడుతున్నారు. ఇక ఇప్పుడు అసలు సమయం వచ్చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితి ఎదురైంది. మరి ఈ పండగ పూటైనా మన హీరోలు చెలరేగుతారా..? అభిమానులకు విజయ దశమిని మిగులుస్తారా... లేక మరో పరాభవాన్ని రుచి చూపిస్తారా..?
 
చెన్నై: దక్షిణాఫ్రికా చేతిలో టి20 సిరీస్ కోల్పోయిన భారత్, వన్డే సిరీస్ కూడా చేజారకుండా ఉండాలంటే రెట్టింపు శ్రమించాల్సిన పరిస్థితిలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడిన ధోని సేన చావోరేవోలాంటి పోరుకు సిద్ధమైంది. నేడు (గురువారం) ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగే నాలుగో వన్డేలో భారత్ జట్టు సఫారీలతో తలపడుతుంది. మూడు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్ వైఫల్యమే భారత్‌ను దెబ్బతీయడంతో ఈ సారైనా మన లైనప్ నిలబడుతుందా అనేది చూడాలి. మరో వైపు ప్రధాన ఆటగాడు డుమిని దూరం కావడంతో దక్షిణాఫ్రికా ఒక్కసారిగా బలహీనంగా మారింది.

ముగ్గురు స్పిన్నర్లతోనే: ఎట్టకేలకు గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఫామ్‌లోకి వచ్చినా భారత్ విజయానికి ఆ ప్రదర్శన సరిపోలేదు. తనకిష్టమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాణించిన కోహ్లి, దీనిని కొనసాగించాల్సి ఉంది. రోహిత్ ఫామ్ అద్భుతంగా కొనసాగుతుండగా, ఓపెనింగ్ సహచరుడు ధావన్ 3 ఇన్నింగ్స్‌లలో కలిపి 59 పరుగులు మాత్రమే చేయగలగడం జట్టు శుభారంభాన్ని దెబ్బ తీస్తోంది. అందరికి మించి 3, 0, 0 పరుగులు చేసిన రైనా కోలుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక ఉండదు. తనకు సొంత మైదానంతో సమానమైన చేపాక్‌లో చెలరేగడం భారత్‌కు ఎంతో అవసరం. గతంతో పోలిస్తే ధోని బ్యాటింగ్ శైలి మారింది. ఇండోర్ వన్డేలో అతని అద్భుత ఇన్నింగ్స్ జట్టును గెలిపించినా... గత మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో అతి జాగ్రత్తగా ఆడి ఒత్తిడి పెంచుకోవడం ధోనినుంచి ఊహించలేనిది. అతను మరోసారి నాలుగో స్థానంలోనే బరిలోకి దిగాలని భావిస్తుండగా... రహానే పరిస్థితి మాత్రం గందరగోళంగా తయారైంది. రెండు అర్ధ సెంచరీల తర్వాత ఆరో స్థానంలో చివర్లో వేగంగా ఆడలేక  విఫలమైన రహానేను ఈ సారి ఎక్కడ ఆడిస్తారో చూడాలి. బౌలింగ్‌లో మన స్పిన్నర్లు ముగ్గురూ హర్భజన్, అక్షర్, మిశ్రా రాణించారు కాబట్టి మరోసారి స్పిన్‌ను నమ్ముకోవచ్చు. పేసర్ అరవింద్‌కు తొలి వన్డే ఆడే అవకాశం ఉంది.

మోరిస్‌కు చాన్స్: టి20ల్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన డుమిని వన్డేల్లోనూ కీలక పాత్ర పోషించాడు. రాజ్‌కోట్‌లో మధ్య ఓవర్లలో అతని స్పిన్ బౌలింగ్ వల్లే భారత్ ఓడిందనేది స్పష్టం. అయితే గాయంతో డుమిని దూరం కావడం సఫారీలకు పెద్ద దెబ్బ. అతని స్థానంలో ఎంపికైన ఎల్గర్, బుధవారం ఉదయమే జట్టుతో చేరడంతో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు తక్కువ. కాబట్టి బౌలింగ్ ఆల్‌రౌండర్ మోరిస్ లేదా కొత్త బ్యాట్స్‌మన్ జోండోలలో ఒకరిని ఎంపిక చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. అయితే ఎవరు వచ్చినా డుమిని స్పిన్ బలాన్ని మాత్రం ఆ జట్టు కోల్పోతుంది. ఫలితంగా బెహర్దీన్ ఎక్కువ ఓవర్లు వేయాల్సి రావడం భారత్‌కు లాభించే అంశం. ప్రధాన పేసర్లు స్టెయిన్, మోర్కెల్, రబడ రాణిస్తే ఆ జట్టుకు ఇబ్బంది ఉండదు. తాహిర్ కూడా బాగానే ప్రభావం చూపిస్తున్నాడు. అయితే గత మ్యాచ్‌లో చిన్న గాయానికి గురైన మోర్కెల్ కోలుకోకపోతే అబాట్ జట్టులోకి వస్తాడు.  ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఫర్వాలేదనిపించిన మిల్లర్ మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది. డివిలియర్స్, డు ప్లెసిస్ ఫామ్‌లో ఉండగా, ఆమ్లా వైఫల్యంపై జట్టు ఆందోళన పడుతోంది. బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగానే కనిపిస్తున్నా...ఇక్కడి వికెట్‌పై స్పిన్‌ను ఎలా ఎదుర్కొంటారనేదానిపైనే సఫారీల సిరీస్ అవకాశాలు నిలిచి ఉంటాయి.
 జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, రహానే, అక్షర్, హర్భజన్, మిశ్రా, భువనేశ్వర్, అరవింద్.
 దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, డి కాక్, డు ప్లెసిస్, బెహర్దీన్, మిల్లర్, మోరిస్, స్టెయిన్, రబడ, తాహిర్, మోర్కెల్/అబాట్.
 
 ఎలాగైనా మేం ఈ మ్యాచ్ గెలవాల్సిందే. పరిస్థితులను మార్చగల సత్తా ఈ జట్టుకు ఉంది. గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే మేం మరింత తెలివిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. మా స్పిన్నర్లు సింగిల్స్ ఇవ్వకుండా కట్టడి చేస్తే వారిపై ఒత్తిడి పెరుగుతుంది. అటాకింగ్ చేస్తూ కొన్ని పరుగులు ఇచ్చినా వికెట్ దక్కితే మ్యాచ్ దిశ మారుతుంది. కాబట్టి ఏం చేసినా జట్టు విజయం కోసమే. పోలీసు కేసుతో మ్యాచ్‌కు సంబంధం లేదు. మిశ్రా ఈ వన్డేకు అందుబాటులోనే ఉన్నాడు.                -హర్భజన్ సింగ్
 
మేం టి20 సిరీస్ గెలిచినా ఇవాళ వన్డే కూడా గెలుస్తామని అతి విశ్వాసంతో లేము. ఒక్క రోజులో పరిస్థితి తలకిందులు కావచ్చు. కాబట్టి మేం వంద శాతం శ్రమిస్తాం. అయితే విదేశాల్లో బాగా ఆడాలని మేం గట్టి పట్టుదలతో ఇక్కడికి వచ్చాం. ఫలితాలు అన్నీ అనుకూలంగా రావడం సంతోషం. సిరీస్ గెలిచే అవకాశాన్ని పోగొట్టుకోం. ఆధిక్యంలో ఉన్నాం కాబట్టి మాపై ఒత్తిడి లేదు. భారత్‌కు వచ్చి రెండు వారాలు దాటింది కాబట్టి చెన్నైలో వేడి గురించి ఆందోళన లేదు. ఇక్కడి పిచ్‌లపై నిలకడగా వికెట్లు తీయలేకపోయినా మా పేసర్లే మా ప్రధానం బలం.           -స్టెయిన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement