టోక్యో: జపాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టోక్యో ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా తిలకించాలనుకునే ప్రేక్షకుల కోసం టికెట్ కబుర్లను ఆర్గనైజర్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే ఈ పోటీల కోసం ఆతిథ్య ఏర్పాట్లన్నీ తుదిదశకు చేరుకున్నాయి. దీంతో టికెట్ల విక్రయానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. 33 క్రీడాంశాల్లో 339 విభాగాల్లో జరిగే ఈవెంట్లను తిలకించేందుకు 78 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచారు. వచ్చే నెల నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు. సాధారణ టికెట్ల ధర రూ.1550 (2500 జపాన్ యెన్‌లు) నుంచి మొదలవుతుంది. అంగరంగవైభవంగా జరిగే ప్రారంభోత్సవాన్ని ప్రత్యేకంగా దగ్గరి నుంచి చూడాలనుకుంటే మాత్రం రూ. లక్షా 86 వేలు (3 లక్షల యెన్‌లు) వెచ్చించాల్సి ఉంటుంది. పురుషుల 100 మీటర్ల ఫైనల్‌ను దగ్గరి నుంచి వీక్షించాలనుకుంటే రూ.80,612 (లక్షా 30 వేల యెన్‌లు) చెల్లించాలి.
ఇక మిగతా టికెట్లన్నీ రూ.4960 (8000 యెన్‌లు)కు కాస్త అటు ఇటుగా ఉన్నాయి. 2020వ సంవత్సరంలో మెగా ఈవెంట్ జరుగుతుండటంతో జపాన్ వాసులకు ప్రత్యేకంగా 2020 యెన్‌లతో (రూ.1250) టికెట్లను విక్రయిస్తారు. ఇవి మే 9 నుంచి 28 వరకు లాటరీ పద్ధతిలో అందజేస్తారు. ఆ తర్వాత అంతర్జాతీయ వీక్షకుల కోసం జూన్ 15 నుంచి అమ్మకాలు చేపడతారు. ఎవరైనా సరే ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం మాత్రం తప్పనిసరి. జ్టి్టpట://్టజీఛిజ్ఛ్టు.్టౌజుyౌ2020.ౌటజ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి టికెట్లు కొనుగోలు చేయవచ్చు. 78 లక్షల టికెట్లలో 70 నుంచి 80 శాతం టికెట్లను జపాన్ వాసులకు కేటాయించారు. వచ్చే ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment