శ్రీలంక పర్యటన ప్రత్యేకం: కోహ్లి
కొలంబో: శ్రీలంకను అన్ని ఫార్మాట్లలోనూ వైట్ వాష్ చేయడం చాలా ప్రత్యేకమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన ఏకైక టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇలా పర్యటనను క్లీన్‌స్వీప్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదని, ఈ ఘనత జట్టు మొత్తానికి చెందుతుందని విజయానంతరం కోహ్లి తెలిపారు. ఈ పర్యటనలో తమ రిజర్వ్ బెంచ్ సత్తా చాటిందన్నారు.
కేఎల్ రాహుల్, అజింక్యా రహానేల స్థానాల మార్పు, ధావన్‌ను తప్పించి యువ క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్‌కు జట్టులో చోటుకల్పించడం వంటి ప్రయోగాలు ఫలించాయని పేర్కొన్నారు. ఆటగాళ్లందరూ తమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని కొనియాడారు. తన ఆటతీరు సంతృప్తిని ఇచ్చిందన్న కోహ్లి అన్ని ఫార్మట్లకు దగ్గట్టు బ్యాటంగ్ శైలిని మార్చుకుంటున్నాని, అన్ని ఫార్మట్లు ఆడటమే నా అభిమతమని చెప్పుకొచ్చారు.
ఈ సిరీస్‌లో కోహ్లి రెండు వరుస సెంచరీలతో అత్యధిక సెంచరీ పట్టికలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ సరసన చేరారు. టీ20ల్లో కోహ్లి(82) అర్ధసెంచరీతో మరో ఘనతను సొంతం చేసుకున్నారు. చేజింగ్‌లో అత్యధిక పరుగుల చేసిన టీ20 క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశారు. ఇప్పటికే టెస్టుసిరీస్ 3-0, వన్డే 5-0తో కోహ్లిసేన క్లీన్‌స్వీప్ చేసింది. మెత్తం 9-0తో పర్యటననే వైట్ వాష్ చేసింది.