కోహ్లితో సరదాగా రోహిత్..
కొలంబో: శ్రీలంకపై నాలుగో వన్డే విజయానంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు సరదాగా ముచ్చటించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఈ కెప్టెన్, వైస్ కెప్టెన్‌లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ 168 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మైక్ పట్టుకొని కామెంటేటర్ అవతారమెత్తారు. మ్యాచ్ విశేషాలను కోహ్లితో ముచ్చిటించారు. ఈ వీడియోని ‘ఒక ఫ్రేమ్‌లో ఇద్దరు రాక్‌స్టార్స్’ అనే క్యాప్షన్‌తో బీసీసీఐ ట్వీట్ చేసింది.
రోహిత్ మ్యాచ్ గెలిచినందుకు కోహ్లిని అభినందిస్తూ.. నీవు నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టు అద్భుతంగా రాణిస్తుందని కితాబిచ్చారు. దీనికి కోహ్లి బదులుగా ‘ధన్యవాదాలు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నందకు అద్బుతంగా ఉంది. నిజానికి భారత జట్టు మంచి ప్రదర్శన కనబర్చడానికి ఆకలితో ఉంది. అదే ఈ విజయాన్ని సులువు చేసింది.’ అని కోహ్లి అభిప్రాయపడ్డారు. కేవలం నేను ఫీల్డింగ్ మాత్రమే సెట్ చేశాను. మిగతా పని అంతా వారే చేశారని ఆటగాళ్లను కొనియాడారు. కొలంబో పిచ్ చాల తేమగా ఉండటంతో 16 ఓవర్ వరకు వేగంగా పరుగులు చేయలేకపోయామన్నారు. స్కోరు బోర్డును చూడకుండా బ్యాటింగ్‌ను అస్వాదించామని చెప్పుకొచ్చారు.
సపోర్ట్ స్టాఫ్ మద్దతు గురించి రోహిత్ ప్రశ్నించగా.. వారి మద్దతు ఎనలేనిదని, 2014లో ఆస్ట్రేలియాలో వారి మద్దతుతోనే తొలిసారి కెప్టెన్ అయ్యానని, అప్పడు ర్యాంకింగ్‌లో భారత్ 7 స్థానంలో ఉందని, ఇప్పుడు అదే సపోర్ట్ స్టాఫ్‌తో నెం.1 సాధించామని హెడ్ కోచ్ రవిశాస్త్రిని ఉద్దేశించి కోహ్లి పేర్కొన్నారు. వారు జట్టు ఆటగాళ్లకు ప్రత్యేకమని, వారితో పనిచేయడం సంతోషంగా ఉందని, మేమంతా ఒక కుటుంబ సభ్యులమని తెలిపారు.