ముక్కోణపు సిరీస్: రేపే భారత్ కు తొలి పరీక్ష
మెల్ బోర్న్: వన్డే ప్రపంచ కప్ సమరానికి ముందు భారత్ మినీ పోరుకు సిద్ధమైంది. గత రెండు ప్రపంచ కప్ విజేతలు, వన్డే ర్యాంకింగ్స్లో అగ్రశ్రేణి జట్లయిన భారత్ (నెంబర్ 2), ఆస్ట్రేలియా (నెంబర్ 1) మధ్య ఆసక్తికర పోరు కొన్ని గంటల్లో ఆరంభంకానుంది. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆదివారం జరగనుంది.
టెస్టు సిరీస్లో ఓడినా పోరాటపటిమతో ఆకట్టుకున్న టీమిండియా.. వన్డేల్లో దూకుడు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. టెస్టులకు గుడ్ బై చెప్పిన కెప్టెన్ ధోనీ పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్ పైనే పూర్తిగా దృష్టిసారిస్తున్నాడు. గత ప్రపంచ కప్లో భారత్ను జగజ్జేతగా నిలిపిన ధోనీ ఈ సారి కూడా జట్టును విజయపథంలో నడిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక స్వదేశంలో జరిగే ప్రపంచ కప్ ముందు ముక్కోణపు సిరీస్లో సత్తా చాటాలని కంగారూలు ఉవ్విళ్లూరుతున్నారు. సొంత వేదిక, అభిమానుల మద్దతు వారికి కలసి వచ్చే అంశం.
యువ ఆటగాళ్లతో కూడిన భారత్ బ్యాటింగ్లో బలోపేతంగా కనిపిస్తోంది. ధవన్తో పాటు రోహిత్ లేదా రహానె ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. రైనా, ధోనీ అదనపు బలం. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ ఇషాంత్ గాయాల నుంచి కోలుకున్నా ఈ మ్యాచ్లో ఆడకపోవచ్చు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, ఉమేష్, షమీ, అశ్విన్ కీలకం. ఆస్ట్రేలియా విషయానికొస్తే బౌలింగ్లో బలోపేతంగా ఉంది. బ్యాటింగ్లో కూడా పించ్ హిట్టర్లకు, స్టార్ బ్యాట్స్మెన్కు కొదవలేదు. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశముంది.
జట్లు (అంచనా)
భారత్: ధవన్, రోహిత్, కోహ్లీ, రహానె, రైనా, ధోనీ (కెప్టెన్/కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, భువనేశ్వర్, ఉమేష్
ఆస్ట్రేలియా: అరోన్ ఫించ్, వార్నర్, వాట్సన్, స్మిత్, బెయిలీ (కెప్టెన్), మ్యాక్స్వెల్, బ్రాడ్ హాడిన్ (కీపర్), ఫాల్కనర్, స్టార్క్, కమిన్స్, డోహర్టీ
పిచ్: ఎంసీజీ వికెట్ స్లోగా ఉంటుంది. పేస్, బౌన్స్కు కొద్దిగా సహకరించవచ్చు. వాతావరణం సానుకూలంగా ఉంటుంది.
సమయం: ఉదయం 8:50 నుంచి