2 సెంచరీలు చేసినా తలరాత మారలేదు! | Two centuries, 212-run partnership, 9/46 and a dramatic Indian defeat | Sakshi
Sakshi News home page

2 సెంచరీలు చేసినా తలరాత మారలేదు!

Published Wed, Jan 20 2016 7:59 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

2 సెంచరీలు చేసినా తలరాత మారలేదు!

2 సెంచరీలు చేసినా తలరాత మారలేదు!

నాలుగు మ్యాచులు.. ఐదు సెంచరీలు.. అయినా ఆస్ట్రేలియాకు అతిథిగా వెళ్లిన భారత్ అదృష్టరేఖ మారలేదు. ఆసిస్‌తో గడిచిన నాలుగు వన్డేల్లోనూ మెరుగ్గా స్కోరు చేసినా.. గెలుపు కోసం చివరవరకు పోరాడినా.. విజయలక్ష్మి మాత్రం ధోనీ సేన గడప తొక్కడం లేదు.

తాజాగా ఓడిన నాలుగో వన్డేలో మరీ ఘోరం.. ఇద్దరు బ్యాట్స్‌మెన్లు సెంచరీలు చేశారు. 212 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది.  చివరకు వచ్చేసరికి టీమిండియా సైకిల్‌ స్టాండ్‌ను తలపించేలా కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్‌సన్ తొలిసారి ఐదు వికెట్లతో చెలరేగడంతో నాటకీయరీతిలో కంగారు సేన 25 పరుగులతో విజయాన్ని చేజిక్కించుకుంది. కాన్‌బెర్రాలో జరిగిన నాలుగో వన్డేలో ఆద్యంతం బ్యాట్స్‌మెన్ల హవానే కొనసాగింది. భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లి, శిఖర్ ధావన్, ఆసిస్‌ నుంచి ఆరోన్ ఫించ్‌ సెంచరీలు చేశారు. ప్రపంచంలోనే రెండు అత్యుత్తమ క్రికెట్‌ జట్లు తలపడిన ఈ మ్యాచ్‌లో 671 పరుగులు నమోదయ్యాయి. కానీ చివరకు ఈ వన్డేను శాసించింది మాత్రం నిలకడలేని టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన రిచర్డ్‌సనే. తన అద్భుత బౌలింగ్‌తో 68 పరుగులకు 5 వికెట్లు తీశాడు.

349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక వికెట్ నష్టానికి 277 పరుగులు చేసి ఒక దశలో పటిష్ట స్థితిలో కనిపించింది. తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నప్పుడు భారత్ ఇంకా చేయాల్సిన పరుగులు 72 మాత్రమే. ధావన్ (126), కోహ్లి (106) కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో భారత్‌ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అంతా భావించారు. కానీ ఊహించనిరీతిలో కుప్పకూలి.. తన నిలకడలేనితనాన్ని నిరూపించకుంటూ టీమిండియా మరోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో 4-0తో అవమానకరరీతిలో వెనుకబడిపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement