
అక్మల్.. వెనక్కి వచ్చేయ్..!
లండన్: త్వరలో చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు నుంచి ఉమర్ అక్మల్ ను తప్పించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ క్యాంపు నుంచి అతన్ని వెనక్కి వచ్చేయమంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆదేశించింది. గత కొన్ని రోజుల నుంచి ఉమర్ అక్మల్ కు నిర్వహిస్తున్న రెండు ఫిట్నెస్ టెస్టుల్లో అతను విఫలమవుతున్న నేపథ్యంలో వెనక్కి వచ్చేయాల్సిందింగా పీసీబీ కబురు పంపింది.
దాంతో ఉమర్ అక్మల్ తిరుగు పయనం అయ్యేందుకు సిద్ధమవుతుండగా, అతని స్థానంలో ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నారు పాకిస్తాన్ సెలక్టర్లు. ఉమర్ అక్మల్ స్థానంలో యువ క్రికెటర్లు ఉమర్ అమిన్ కానీ, హారిస్ సోహైల్ను కానీ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఉమర్ అక్మల్ ను వెనక్కి రప్పిస్తున్నట్లు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంగ్లండ్ లో అతనికి నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షల్లో ఫెయిలైనట్లు షహర్యార్ తెలిపారు. చాంపియన్స్ ట్రోఫీకి ఫిట్ నెస్ టెస్టుల్లో విఫలమైన ఆటగాళ్ల స్థానాల్ని భర్తీ చేసేందుకు మే 25వ తేదీ వరకూ మాత్రమే గడవు ఉందని పేర్కొన్నారు. జూన్ 1 వ తేదీ నుంచి చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జూన్ 4వ తేదీన మ్యాచ్ జరుగనుంది.