హైదరాబాద్: టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు సాధించిన ఎనిమిదో భారత పేసర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ భారత్ తరఫున ఏడుగురు మాత్రమే ఈ ఘనత సాధించగా, ఆ తర్వాత స్థానాన్ని ఉమేశ్ ఆక్రమించాడు. హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిపోయిన ఉమేశ్.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. ఫలితంగా తొలిసారి 10 వికెట్లను సాధించాడు. అంతకముముందు కపిల్‌దేవ్, చేతన్ శర్మ, వెంకటేశ్ ప్రసాద్, జవగళ్ ప్రసాద్, ఇర్ఫాన్ పఠాన్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్‌లు మాత‍్రమే టీమిండియా తరఫున ఒక టెస్టులో 10 వికెట్లు సాధించిన పేసర్లు. కాగా, కపిల్‌దేవ్, ఇర్ఫాన్ పఠాన్‌లు రెండేసి సార్లు ఆ ఘనత సాధించారు.
రెండో టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 72 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా వికెట్ నష్టపోకుండా ఛేదించింది. కేఎల్ రాహుల్(33 నాటౌట్), పృథ్వీ షా(33 నాటౌట్) వికెట్ పడకుండా భారత్‌కు విజయాన్ని అందించారు. దాంతో విరాట్ గ్యాంగ్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 127 పరుగులకే కుప్పకూలింది. ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ను టీమిండియా బెంబేలెత్తించింది. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్, కీరన్ పావెల్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించిన భారత్.. ఆపై అదే దూకుడుతో విండీస్‌కు చుక్కలు చూపించింది. సునీల్ అంబ‍్రిస్(38;95 బంతుల్లో 4 ఫోర్లు), షాయ్ హోప్(28; 42 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త భారత బౌలర్లను ప్రతిఘటించగా, మిగతా వారు చేతులెత్తేశారు. ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment