
వాషింగ్టన్ సుందర్(ఫైల్ ఫోటో)
కొలంబో: అండర్-19 ముక్కోణపు టోర్నీలో భారత్ కుర్రాళ్లు అదరగొట్టారు. సోమవారం ఇక్కడ ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. శ్రీలంక నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 33.5 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి ఛేదించింది. భారత ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్(56), రిషాబ్ పాంట్(35) శుభారంభాన్నివ్వగా, అనంతరం రికీ భుయ్(29), కెప్టెన్ ఇషాన్ కిషన్(12)లు మిగతా పనిని పూర్తి చేశారు. శ్రీలంక బౌలర్లలో దమిత్ సిల్వా మూడు వికెట్లు తీశాడు.
తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని 47.2 ఓవర్లలో 158 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక ఆటగాళ్లలో విషాద్ రందికా డిసిల్వా(58) హాఫ్ సెంచరీ మినహా చెప్పుకోదగ్గ స్కోరు లేదు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంక భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. భారత్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, అవిష్ ఖాన్, మయాన్ దాగర్ లు కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఇదిలా ఉండగా, ముక్కోణపు టోర్నీలో ఒక మ్యాచ్ ల్లో కూడా ఓటమి చెందంకుండా ట్రోఫీని అందుకున్న యువ భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అభినందించింది.