భాగ్యనగరం ఎన్నో ఐపీఎల్ టి20 మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది. కానీ అంతర్జాతీయ మెరుపులే లేవు. వన్డే, టెస్టులకు ఆతిథ్య మిచ్చిన ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఇప్పుడు ఆ ‘పొట్టి’ లోటునూ తీర్చు కునేందుకు సిద్ధమైంది. ఫామ్‌లో ఉన్న కోహ్లి సేన జోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు భాగ్యనగర క్రికెట్ ప్రియులు పోటెత్తనున్నారు. ‘ఢీ’కొట్టేందుకు వెస్టిండీస్ ‘సై’ అంటోంది.
సాక్షి, హైదరాబాద్: భారత కుర్రాళ్లను ఇప్పుడు ఐపీఎల్ వేలమే కాదు... వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్ కూడా ఊరిస్తోంది. తమ నిలకడైన ప్రదర్శనతో అటు ఫ్రాంచైజీలు, ఇటు సెలక్టర్ల కంట పడేందుకు యువ ఆటగాళ్లకు విండీస్‌తో సిరీస్ చక్కని అవకాశం కలిపిస్తోంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్‌లో హిట్టయినా... టీమిండియా తరఫున ఫ్లాపవుతున్న ఆటగాళ్లు మనసుపెడితే చోటు ఖాయం చేసుకునే తరుణం కూడా ఇదే! ఐపీఎల్ వేలానికి ముందు జరుగుతున్న సిరీస్ కాబట్టి ఎవరు మెరిపిస్తే వాళ్లపైనే కాసులు కురుస్తాయన్న సంగతి ఆటగాళ్లకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో భారత తుది జట్టుకు ఆడే కుర్రాళ్లు అందివచి్చన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో పడ్డారు.
నడిపించే నాయకుడొచ్చాడు...
బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లి మళ్లీ జట్టును నడిపించేందుకు రావడమే భారత్‌కు సగం బలం. భారత విజయవంతమైన సారథి ఫామ్‌కు ఏ ఢోకా లేదు. ఆడేది ముందయినా... తర్వాత ఛేదన అయినా తన వంతు మెరుపులు మెరిపిస్తాడు. చాన్నాళ్ల తర్వాత టి20 జట్టులోకి కీలక బౌలర్లు పునరాగమనం చేశారు. పేసర్లు భువనేశ్వర్, షమీ, కుల్దీప్‌లు పొట్టి మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. జట్టు కూర్పులో భాగంగా ఇద్దరేసి సీమర్లు, స్పిన్నర్లను తీసుకుంటే కుల్దీప్, షమీకి తుది జట్టులో చాన్స్ లేకపోవచ్చు. ఇటీవల యువ పేసర్ దీపక్ చాహర్ చెలరేగుతుండటంతో కోహ్లి ఈ కుర్రాడివైపే మొగ్గుచూపొచ్చు. అలాగే రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో అక్కరకొస్తాడు. కాబట్టి యజువేంద్ర చహల్‌కు జతగా జడేజానే కోహ్లి ఎంపికవుతుంది. దీంతో కుల్దీప్ బెంచ్‌కే పరిమితం కావాలి. మిడిలార్డర్‌లో అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబేల స్థానాలకు ఢోకా లేదు.
రాహుల్‌కు భలే చాన్సులే!
రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ఈ సిరీస్‌కు దూరం కావడం లోకేశ్ రాహుల్‌కు వరమైంది. దీంతో ప్రతీ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం దక్కుతుంది. ఇక్కడ మెరుపులు మెరిపిస్తే రోహిత్‌కు రెగ్యులర్ భాగస్వామి కూడా కావొచ్చు. పైగా టి20ల్లో రాహుల్‌కు మంచి రికార్డే ఉంది. 31 పొట్టి మ్యాచ్‌ల్లో 42.74 సగటుతో 974 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్‌లోనూ వీరబాదుడు బాదిన సంగతి తెలిసిందే. మరో యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఈ సిరీస్‌లో తానేంటో నిరూపించుకోవాలి. కెప్టెన్, జట్టు మేనేజ్‌మెంట్ నుంచి కావాల్సినంత సహకారం లభిస్తున్నా... ఇంకా జట్టులో ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ధోని వారసుడిగా వచి్చన పంత్ నిలకడలేని ఆటతీరుతో నిరాశపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను విండీస్‌పైనా పట్టుదలతో రాణించాల్సిన అవసరముంది.
అనుభవలేమి అసలు సమస్య...
అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం ప్రస్తుత వెస్టిండీస్‌కు పెద్ద సమస్య. ఈ ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్ మెరుపులు మెరిపించిన రసెల్ సహా, బ్రాత్‌వైట్, బ్రేవోలను కాదని వెస్టిండీస్ పూర్తిగా యువ ఆటగాళ్లతో భారత్‌కు వచ్చింది. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో హిట్టర్ నికోలస్ పూరన్ కూడా మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో పర్యాటక జట్టు బ్యాటింగ్ లైనప్ ప్రధానంగా ఓపెనర్లు ఎవిన్ లూయిస్, లెండిల్ సిమన్స్, హెట్‌మైర్, కెప్టెన్ పొలార్డ్‌లపైనే ఆధారపడి ఉంది. ఇక బౌలర్ల విషయానికొస్తే హోల్డర్, కీమో పాల్, కాట్రెల్‌లపై జట్టు నమ్మకం పెట్టుకుంది. భారత్‌లో ఆడిన అనుభవం తమకు వుందని, యువసత్తాతోనే కోహ్లిసేను ఓడిస్తామని పొలార్డ్ చెప్పాడు.
పిచ్, వాతావరణం
ఇప్పటిదాకా పొట్టిఫార్మాట్‌లో ఈ పిచ్ బౌలర్లకు బాగా కలిసొచ్చింది. ఐపీఎల్‌లో హోమ్ టీమ్ సన్‌రైజర్స్ బౌలర్లు తమ బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోరు చేసినా నిలబెట్టిన సందర్భాలున్నాయి. చల్లటి సాయంత్రం వర్షం ముప్పేమీ లేదు. మంచు ప్రభావం దృష్ట్యా పిచ్‌ను పూర్తిగా కప్పి ఉంచారు.
మూడో కంటికి నోబాల్...
ఇప్పటిదాకా నోబాల్‌ను ఫీల్డు అంపైర్లే చూసేవారు. వారు చూసినపుడు నోబాల్... లేదంటే లేదు. కొన్ని సందర్భాల్లో గీత దాటిన నోబాల్‌కు నాటౌట్ అయినా... అంపైర్లు దాన్ని గమనించకపోవడంతో పెవిలియన్ చేరిన సందర్భాలున్నాయి. అయితే నోబాల్‌ను ఇకపై థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తారు. భారత్, వెస్టిండీస్‌ల సిరీస్‌తో నోబాల్ నిర్ణయాధికారం థర్డ్ అంపైర్ పరిధిలోకి వెళ్తుందని ఐసీసీ తెలిపింది.
►8 భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు 14 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 8 మ్యాచ్‌ల్లో నెగ్గగా... విండీస్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. విండీస్‌తో జరిగిన చివరి 5 టి20ల్లో భారత్‌నే విజయం వరించింది.
►1 మరో సిక్స్ కొడితే అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టు, వన్డే, టి20) 400 సిక్స్‌లు పూర్తి చేసుకోనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 399 సిక్స్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో క్రిస్ గేల్ (534 సిక్స్‌లు), షాహిద్ అఫ్రిది (476 సిక్స్‌లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
►టి20 క్రికెట్లో ఆరుగురి బౌలింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఎంచుకున్న ఐదుగురు బౌలర్లు అన్ని ఓవర్ల (నాలుగు ఓవర్ల కోటా)ను అద్భుతంగా వేస్తారని ఆశించలేం. అందుకే ఆరో బౌలింగ్ ఆప్షన్ ఉండాలి. ప్రపంచకప్ కోసం జట్టులో పేసర్ల మధ్యే పోటీ నెలకొంది. బుమ్రా, భువనేశ్వర్, షమీలతో పాటు యువ బౌలర్ దీపక్ చాహర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. టాప్–4లో రోహిత్, రాహుల్, నేను, అయ్యర్ పదిలంగా ఉన్నాం. రిషభ్‌కు మిడిలార్డర్‌లోనే అవకాశమిస్తాం. అతను ధోనిలా అనుకరించి విఫలమైనంత మాత్రానా ధోని పేరుతో వెక్కిరించడం ధోని స్థాయిని కించపరచడమే అవుతుంది. పంత్‌లో సహజసిద్ధమైన ప్రతిభవుంది. అవకాశాలు ఇస్తే నిలకడైన బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకునే సత్తా అతనిలో ఉంది.
–భారత కెప్టెన్ కోహ్లి
►నాకు భారత్‌లో ఆడిన అనుభవముంది. ప్రస్తుతం ఇదే మాకు అక్కరకొస్తుంది. ఆతిథ్య దేశానికి సవాల్ విసిరేందుకు మా కుర్రాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. సిరీస్ కోసం బాగా సన్నద్ధమయ్యాం. తప్పకుండా మా వాళ్లు రాణిస్తారు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ మేటి ప్రత్యర్థి. టెస్టుల్లో నంబర్‌వన్ అయిన జట్టును మేం ధీటుగా ఎదుర్కొంటాం. మెరుగైన ప్రదర్శన కనబరుస్తాం. అందుబాటులో ఉన్న అవకాశాల్ని వినియోగించుకుంటాం. ఒకరిద్దరి ఆటగాళ్ల చుట్టూనే తిరగం. వారిపై ఆధారపడం. జట్టుగా ఏం చేయాలో... ఎలా పోరాడాలో మాకు తెలుసు.
–వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్
Comments
Please login to add a commentAdd a comment