‘అద్భుతంగా అనిపిస్తోంది. ఇదే తరహాలో మరింతగా కష్టపడుతూనే ఆధిక్యం ప్రదర్శించడాన్ని కొనసాగిస్తాను. గొప్పవాళ్ల జాబితాలో కొనసాగాలన్నదే నా లక్ష్యం. జస్టిన్ గాట్లిన్ కారణంగా నేను ఆందోళన చెందలేదు. నాకన్నా ముందే అతనికి బ్యాటన్ దక్కినా నేను అతడిని అందుకోగలననే నమ్మకం ఉంది. సాధ్యమైనంత వేగంగా పరుగెత్తడమే
నాకు తెలుసు.’ -ఉసేన్ బోల్ట్
మాస్కో: సమకాలీన ప్రపంచ అథ్లెటిక్స్‌లో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’కు పర్యాయపదం తానేనని నిరూపిస్తూ ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ మరోసారి మెరిశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ఘనమైన ముగింపు ఇచ్చాడు. పోటీల చివరి రోజైన ఆదివారం చివరి రేసుగా జరిగిన పురుషుల 4X100 మీటర్ల రిలేలో ఉసేన్ బోల్ట్ సభ్యుడిగా ఉన్న జమైకా బృందం 37.36 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తొలుత నెస్టా కార్టర్ రేసును మొదలుపెట్టి తర్వాత కీమర్ బెయిలీ కోల్‌కు బ్యాటన్ ఇచ్చాడు. అతను మూడో సభ్యుడైన నికెల్ అషమెద్‌కు బ్యాటన్ అందించాడు. నికెల్ నుంచి చివరగా బ్యాటన్‌ను అందుకున్న బోల్ట్ ఎప్పటిలాగే వాయువేగంతో పరిగెత్తాడు. జస్టిన్ గాట్లిన్ (అమెరికా) నుంచి కాస్త పోటీ ఎదురైనా బోల్ట్ చివర్లో వేగం పెంచాడు. దాంతో జమైకా జట్టుకు స్వర్ణం ఖాయమైంది.
చార్లెస్ స్లిమన్, మైక్ రోడ్జర్స్, రాకీమ్ సలామ్, గాట్లిన్‌లతో కూడిన అమెరికా బృందం (37.66 సెకన్లు) రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గావిన్ స్మెలీ, ఆరన్ బ్రౌన్, రిచర్డ్స్ కౌవోక్, జస్టిన్ వార్నర్‌లతో కూడిన కెనడా జట్టు 37.92 సెకన్లలో రేసును ముగించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తొమ్మిది రోజులపాటు జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ఆదివారం తెరపడింది. ఆతిథ్య దేశం రష్యా అత్యధికంగా ఏడు స్వర్ణ పతకాలతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అమెరికా, జమైకా ఆరేసి స్వర్ణాలు సాధించాయి. అయితే ఎక్కువ రజతాలు నెగ్గిన అమెరికాకు రెండో స్థానం లభించగా... జమైకా మూడో స్థానంలో నిలిచింది.
రిలే రేసులో విజయంతో బోల్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో తన స్వర్ణాల సంఖ్యను ఎనిమిదికి పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధిక స్వర్ణాలు నెగ్గిన అథ్లెట్‌గా మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు. గతంలో పురుషుల విభాగంలో కార్ల్ లూయిస్ (అమెరికా), మైకేల్ జాన్సన్ (అమెరికా)... మహిళల విభాగంలో అలీసన్ ఫెలిక్స్ (అమెరికా) ఎనిమిది స్వర్ణాల చొప్పున గెలిచారు.
పతకాల పరంగా బోల్ట్ 10 పతకాలతో కార్ల్ లూయిస్, అలీసన్ ఫెలిక్స్ సరసన నిలిచాడు. 14 పతకాలతో మెర్లిన్ ఒట్టీ (జమైకా) అగ్రస్థానంలో ఉంది. బోల్ట్ 2009 బెర్లిన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు (100, 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలే); 2011 డేగూ ప్రపంచ చాంపియన్‌షిప్ రెండు స్వర్ణాలు (200 మీటర్లు, 4x100 మీటర్ల రిలే); 2013 మాస్కో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు (100, 200 మీటర్లు, 4x100 మీటర్ల రిలే) గెలిచాడు.
షెల్లీ కూడా ‘ట్రిపుల్’
పురుషుల విభాగంలో బోల్ట్ మాదిరిగా మహిళల విభాగంలో షెల్లీ ఆన్ ఫ్రేజర్ ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఇప్పటికే 100, 200 మీటర్ల రేసుల్లో పసిడి పతకాలు సొంతం చేసుకున్న షెల్లీ ఆదివారం జరిగిన 4x100 మీటర్ల రిలేలో జమైకాను విజేతగా నిలిపింది. కారీ రసెల్, కెరన్ స్టీవార్ట్, షిలానీ కాల్వర్ట్, షెల్లీ ఫ్రేజర్‌లతో కూడిన జమైకా జట్టు 41.29 సెకన్లలో రేసును పూర్తిచేసి స్వర్ణ పతకాన్ని నెగ్గింది. ఫ్రాన్స్ (42.73 సెకన్లు) రజతం సాధించగా... అమెరికా (42.75 సెకన్లు) కాంస్యంతో సంతృప్తి పడింది.
మహిళల జావెలిన్ త్రోలో క్రిస్టినా ఒబెర్గ్‌ఫోల్ (జర్మనీ-69.05 మీటర్లు)... పురుషుల ట్రిపుల్ జంప్‌లో టెడ్డీ టామ్‌గో (ఫ్రాన్స్-18.04 మీటర్లు) స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల 1500 మీటర్ల రేసులో అస్బెల్ కిప్రోప్ (కెన్యా-3ని:36.28 సెకన్లు)... మహిళల 800 మీటర్ల రేసులో యునైస్ జెప్‌కోయిచ్ సుమ్ (కెన్యా-1ని:57.38 సెకన్లు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.
పతకాల పట్టిక (టాప్-5)
స్థానం దేశం స్వ ర కాం మొ
1 రష్యా 7 4 6 17
2 అమెరికా 6 13 6 25
3 జమైకా 6 2 1 9
4 కెన్యా 5 4 3 12
5 జర్మనీ 4 2 1 7
నోట్: స్వ-స్వర్ణం, ర-రజతం, కాం-కాంస్యం, మొ-మొత్తం. స్వర్ణాల ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయించారు