స్పీల్‌బర్గ్ (ఆస్ట్రియా): కెరీర్‌లో తొలి డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ఎదురు చూస్తోన్న మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ 2020 ఫార్ములా వన్ (ఎఫ్1) సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. ఏడు నెలల సుధీర్ఘ విరామం అనంతరం సీజన్ ఆరంభ రేసు అయిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో బొటాస్ సత్తా చాటాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో బొటాస్ అందరి కంటే వేగంగా నిమిషం 2.939 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు. దాంతో నేడు జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. జర్మనీ డ్రైవర్ మైఖేల్ షూమాకర్ పేరిట ఉన్న అత్యధిక ఎఫ్1 ప్రపంచ డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్స్ (7) రికార్డును సమం చేయడానికి చూస్తోన్న సహచర డ్రైవర్, డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (6)... ల్యాప్‌ను 0.012 సెకన్లు వెనుకగా పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్, మెక్‌లారెన్ డ్రైవర్ నోరిస్, మరో రెడ్‌బుల్ డ్రైవర్ ఆల్బన్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. గత ఏడాది టీం విభాగంలో రన్నరప్‌గా నిలిచిన ఫెరారీ... క్వాలిఫయింగ్ సెషన్‌లో పూర్తిగా నిరాశ పరిచింది. చార్లెస్ లెక్‌లెర్క్ ఏడు, నాలుగు సార్లు ఎఫ్1 ప్రపంచ డ్రైవర్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ 11వ స్థానంలో నిలిచారు. ప్రధాన రేసును ఆదివారం సాయంత్రం గం. 6.40 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2, హెచ్‌డి 2, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.
4 వేల మందికి ‘నెగెటివ్’
కరోనా నేపథ్యంలో ఫార్ములా వన్ (ఎఫ్1) తాజా సీజన్ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆరంభమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గైడ్‌లైన్స్‌కు లోబడి ఎఫ్1 నిర్వాహకులు వారం వ్యవధిలో 10 జట్ల డ్రైవర్లు, సిబ్బందితో పాటు మొత్తం 4,032 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... అందరికీ నెగెటివ్ అని తేలింది. ఈ పరీక్షలను జూన్ 26 నుంచి జూలై 2 మధ్య నిర్వహించారు. సీజన్ ముగిసే వరకు ప్రతి ఐదు రోజులకొకసారి కరోనా టెస్టులను చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment