Valtteri Bottas
-
బొటాస్‌కు పోల్
ఇమోలా (ఇటలీ): వరుసగా ఏడో ఏడాది కన్స్ట్రక్టర్ (జట్టు) చాంపియన్‌షిప్ టైటిల్‌పై కన్నేసిన ఫార్ములా వన్ (ఎఫ్1) జట్టు మెర్సిడెస్ అదరగొట్టింది. 14 ఏళ్ల తర్వాత ఎఫ్1 సీజన్లో పునరాగమనం చేసిన ఇమోలా రేసు ట్రాక్‌పై ఆ జట్టు డ్రైవర్లు వాల్తెరి బొటాస్, లూయిస్ హామిల్టన్ సత్తా చాటారు. ఇమిలియా రొమాగ్న గ్రాండ్ ప్రి పేరుతో జరుగనున్న ఈ రేసులో భాగంగా శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ పోల్ పొజిషన్ సాధించాడు. అతడు అందరికంటే వేగంగా ల్యాప్‌ను నిమిషం 13.609 సెకన్లలో పూర్తి చేశాడు. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి మొదలు పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సహచరుడు హామిల్టన్ 0.097 సెకన్లు వెనుకగా ల్యాప్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నేడు జరిగే రేసును లూయిస్ హామిల్టన్ లేదా వాల్తెరి బొటాస్లలో కనీసం ఒకరైనా ‘టాప్–4’తో ముగిస్తే.. ఎఫ్1 చరిత్రలో వరుసగా ఏడోసారి కన్స్ట్రక్టర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నెగ్గిన తొలి జట్టుగా మెర్సిడెస్ నిలుస్తుంది. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఆరు ఎఫ్1 సీజన్‌ల్లోనూ మెర్సిడెస్ జట్టే ఈ టైటిల్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం. గతంలో ఫెరారీ (1999–2004 మధ్య) ఇలా వరుసగా ఆరుసార్లు టీమ్ విభాగంలో టైటిల్స్‌ను నెగ్గింది. -
బొటాస్‌కు పోల్ పొజిషన్
నూర్బర్గ్ (జర్మనీ): మెర్సిడెస్ డ్రైవర్లు మరోసారి సత్తా చాటారు. వరుసగా 11వ రేసులోనూ ‘పోల్ పొజిషన్’ను సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన ఫార్ములా వన్ (ఎఫ్1) ఐఫెల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వాల్తెరి బొటాస్... అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 25.269 సెకన్లలో పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ను దక్కించుకున్నాడు. తాజా సీజన్లో బొటాస్‌కు ఇది మూడో ‘పోల్’ కావడం విశేషం. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. మరో వైపు ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్ ప్రి విజయాల (91 టైటిల్స్) రికార్డును సమం చేయడానికి చూస్తోన్న లూయిస్ హామిల్టన్... ల్యాప్‌ను 0.256 సెకన్లు వెనుకగా పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. అనారోగ్యంతో రేసిం గ్ పాయింట్ డ్రైవర్ లాన్స్ స్ట్రోల్ ఐఫెల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌తో పాటు ప్రధాన రేసుకు కూడా దూరమయ్యాడు. దాంతో అతడి స్థానాన్ని నికో హల్కెన్‌బర్గ్ (జర్మనీ)తో రేసింగ్ పాయింట్ టీమ్ భర్తీ చేసింది. క్వాలిఫయింగ్ సెషన్లో హల్కెన్‌బర్గ్ 20వ స్థానంలో నిలిచి రేసును అందరికంటే చివరగా ఆరంభించనున్నాడు. సీజన్ ఆరంభంలో హల్కెన్‌బర్గ్ రేసింగ్ పాయింట్ తరఫున పాల్గొన్నాడు. -
బొటాస్‌కు ‘పోల్ పొజిషన్’
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): మరోసారి మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు తమ సత్తా చాటుకున్నారు. వరుసగా ఐదో రేసులోనూ ‘పోల్ పొజిషన్’ను సాధించారు. శనివారం జరిగిన ఫార్ములావన్ (ఎఫ్1) 70వ వార్షికోత్సవ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ‘పోల్ పొజిషన్’ దక్కించుకున్నాడు. బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 25.154 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి... ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. రేసింగ్ పాయింట్ జట్టు సబ్‌స్టిట్యూట్ డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ మూడో స్థానంలో నిలువడం విశేషం. రేసింగ్ పాయింట్ రెగ్యులర్ డ్రైవర్ సెర్గియో పెరెజ్‌కు కరోనా సోకడంతో హుల్కెన్‌బర్గ్‌కు అవకాశం దక్కింది. గత ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో హుల్కెన్‌బర్గ్ పాల్గొన్నా ప్రధాన రేసు మొదలయ్యే సమయానికి కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో అతను ట్రాక్‌పైకి రాకుండానే వైదొలిగాడు. తన కెరీర్లో 177 రేసుల్లో పాల్గొన్న హుల్కెన్‌బర్గ్ ఏనాడూ టాప్–3లో నిలువలేకపోయాడు. ఎఫ్1 మొదలై ఏడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఎఫ్1 తొలి రేసు వేదిక సిల్వర్‌స్టోన్ సర్క్యూట్లో ఈ రేసును నిర్వహిస్తున్నారు. ఈ సీజన్లో తొలి రేసులో బొటాస్ ‘పోల్’ పొందగా... మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ తర్వాతి మూడు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించాడు. నేటి ప్రధాన రేసు గ్రిడ్ పొజిషన్స్: 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. నికో హుల్కెన్‌బర్గ్ (రేసింగ్ పాయింట్), 4. మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 5. రికియార్డో (రెనౌ), 6. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 7. పియరీ గాస్లే (అల్ఫా టౌరి), 8. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), 9. అలెగ్జాండర్ అల్బోన్ (రెడ్‌బుల్), 10. లాండో నోరిస్ (మెక్లారెన్), 11. ఎస్తెబన్ ఒకాన్ (రెనౌ), 12. వెటెల్ (ఫెరారీ), 13. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 14. గ్రోస్యెన్ (హాస్), 15. జార్జి రసెల్ (విలియమ్స్), 16. డానిల్ క్వియాట్ (అల్ఫా టౌరి), 17. మాగ్నుసెన్ (హాస్), 18. నికోలస్ లతీఫి (విలియమ్స్), 19. గియోవినాజి (అల్ఫా రోమియో), 20. రైకోనెన్ (అల్ఫా రోమియో). -
బొటాస్దే బోణీ
స్పీల్బర్గ్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫార్ములావన్ (ఎఫ్1) 2020 సీజన్ తొలి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సీజన్ తొలి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగిన బొటాస్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యాన్ని కొనసాగించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసులో బొటాస్ అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 55.739 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని పొందాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పోటీపడిన ఈ రేసులో తొమ్మిది మంది మధ్యలోనే వైదొలిగారు. డ్రైవర్ల అత్యుత్సాహంతో మూడుసార్లు ఈ రేసులో సేఫ్టీకారు రావాల్సి వచ్చింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో మెర్సిడెస్‌కే చెందిన మరో స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌పై మూడు స్థానాల గ్రిడ్ పెనాల్టీ విధించారు. అనంతరం ప్రధాన రేసులో ట్రాక్‌పై మరో డ్రైవర్‌ను ఢీకొట్టడంతో ఐదు సెకన్ల పెనాల్టీ వేశారు. దాంతో హామిల్టన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా... చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ)కు రెండో స్థానం... బ్రిటన్‌కు చెందిన లాండో నోరిస్ (మెక్లారెన్) మూడో స్థానం పొందారు. ఈ ప్రదర్శనతో నోరిస్ (20 ఏళ్ల 235 రోజులు) ఫార్ములావన్ చరిత్రలో పిన్న వయస్సులో పోడియం (టాప్–3)పై నిలిచిన మూడో డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మాక్స్ వెర్స్టాపెన్ (18 ఏళ్ల 228 రోజులు), లాన్స్ స్ట్రోల్ (18 ఏళ్ల 240 రోజులు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రేసు ప్రారంభానికి ముందు జాత్యాహంకారానికి వ్యతిరేకంగా వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌తో కలిసి మరో 13 మంది డ్రైవర్లు మోకాలిపై నిల్చోని తమ సంఘీభావం తెలిపారు. సీజన్‌లోని రెండో రేసు ఇదే వేదికపై 10న జరుగుతుంది. ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. బొటాస్ (మెర్సిడెస్–25 పాయింట్లు); 2. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ–18); 3. లాండో నోరిస్ (మెక్లారెన్–16); 4. హామిల్టన్ (మెర్సిడెస్–12); 5. కార్లోస్ సెయింజ్ జూనియర్ (మెక్లారెన్–10); 6. పెరెజ్ (రేసింగ్ పాయింట్–8); 7. పియరీ గాస్లీ (అల్ఫా టౌరీ–6), 8. ఒకాన్ (రెనౌ–4); 9. గియోవినాజి (అల్ఫా రోమియో–2 పాయింట్లు), 10. వెటెల్ (ఫెరారీ–1 పాయింట్). -
తొలి పోల్ బొటాస్దే
స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): కెరీర్లో తొలి డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం ఎదురు చూస్తోన్న మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ 2020 ఫార్ములా వన్ (ఎఫ్1) సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. ఏడు నెలల సుధీర్ఘ విరామం అనంతరం సీజన్ ఆరంభ రేసు అయిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో బొటాస్ సత్తా చాటాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరి కంటే వేగంగా నిమిషం 2.939 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు. దాంతో నేడు జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. జర్మనీ డ్రైవర్ మైఖేల్ షూమాకర్ పేరిట ఉన్న అత్యధిక ఎఫ్1 ప్రపంచ డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్స్ (7) రికార్డును సమం చేయడానికి చూస్తోన్న సహచర డ్రైవర్, డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (6)... ల్యాప్‌ను 0.012 సెకన్లు వెనుకగా పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్, మెక్లారెన్ డ్రైవర్ నోరిస్, మరో రెడ్‌బుల్ డ్రైవర్ ఆల్బన్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. గత ఏడాది టీం విభాగంలో రన్నరప్‌గా నిలిచిన ఫెరారీ... క్వాలిఫయింగ్ సెషన్లో పూర్తిగా నిరాశ పరిచింది. చార్లెస్ లెక్లెర్క్ ఏడు, నాలుగు సార్లు ఎఫ్1 ప్రపంచ డ్రైవర్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ 11వ స్థానంలో నిలిచారు. ప్రధాన రేసును ఆదివారం సాయంత్రం గం. 6.40 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2, హెచ్డి 2, డిస్నీ ప్లస్ హాట్స్టార్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. 4 వేల మందికి ‘నెగెటివ్’ కరోనా నేపథ్యంలో ఫార్ములా వన్ (ఎఫ్1) తాజా సీజన్ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆరంభమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గైడ్‌లైన్స్‌కు లోబడి ఎఫ్1 నిర్వాహకులు వారం వ్యవధిలో 10 జట్ల డ్రైవర్లు, సిబ్బందితో పాటు మొత్తం 4,032 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... అందరికీ నెగెటివ్ అని తేలింది. ఈ పరీక్షలను జూన్ 26 నుంచి జూలై 2 మధ్య నిర్వహించారు. సీజన్ ముగిసే వరకు ప్రతి ఐదు రోజులకొకసారి కరోనా టెస్టులను చేయనున్నారు. -
జపాన్ గ్రాండ్‌ప్రి విజేత బొటాస్
సుజుకా: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో 12 రేసుల అనంతరం మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మరో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో బొటాస్ 53 ల్యాప్‌ల ప్రధాన రేసును అందరి కంటే ముందుగా గంటా 21 నిమిషాల 46.755 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. వెటెల్ రెండో స్థానంలో... మరో మెర్సిడెస్ డ్రెవర్ హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. ఈ రేసుతో మెర్సిడెస్ జట్టు మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే 2019 కన్స్ట్రక్టర్స్ టీమ్ టైటిల్‌ను దక్కించుకుంది. -
బొటాస్‌కు పోల్ పొజిషన్
షాంఘై: ఫార్ములావన్ సీజన్‌లోని మూడో రేసు చైనా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.547 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్‌కే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఫార్ములావన్‌లో నేడు జరిగే చైనా గ్రాండ్‌ప్రి 1000వ రేసు కానుండటం విశేషం. -
‘బహ్రెయిన్’ విజేత హామిల్టన్
బహ్రెయిన్: నాటకీయంగా సాగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రిలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ లూయీస్ హామిల్టన్ (మెర్సిడెస్) విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. 1 గంట 34 నిమిషాల 21.29 సెకన్లలో హామిల్టన్ రేసును పూర్తి చేశాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానంలో నిలిచాడు. రేసు ఆరంభంనుంచి వేగంగా దూసుకుపోయి విజేతగా నిలుస్తాడని అనిపించిన చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ)ని దురదృష్టం వెంటాడింది. అతని కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 సీజన్లో ప్రస్తుతం అగ్రస్థానంలో బొటాస్ కొనసాగుతుండగా... తర్వాతి రేసు ఏప్రిల్ 12–14 మధ్య చైనా గ్రాండ్ ప్రి రేసు జరుగనుంది. -
బొటాస్‌కు తొలి పోల్
వియన్నా: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ఈ సీజన్లో తొలి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 03.130 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానం నుంచి... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 11వ, 17వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. -
బొటాస్‌కు ‘అబుదాబి’ టైటిల్
అబుదాబి: ఫార్ములావన్ సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో నిర్ణీత 55 ల్యాప్‌లను బొటాస్ గంటా 34 నిమిషాల 14.062 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన బొటాస్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించి రేసును ముగించాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో, ఎస్తెబన్ ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. నిర్ణీత 20 రేసులు ముగిశాక హామిల్టన్ 363 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకోగా... 317 పాయింట్లతో వెటెల్ రన్నరప్‌గా... 305 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. 668 పాయింట్లతో మెర్సిడెస్ జట్టు ప్రపంచ కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించగా... 187 పాయింట్లతో ఫోర్స్ ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. -
బొటాస్‌కు ‘పోల్’ పొజిషన్
అబుదాబి: ఫార్ములావన్ సీజన్‌లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 36.231 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. బొటాస్ కెరీర్లో ఇది నాలుగో ‘పోల్’ కావడం విశేషం. హామిల్టన్ రెండో స్థానం నుంచి, ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా 8, 9 స్థానాల నుంచి మొదలు పెడతారు. -
బొటాస్‌కు రెండో టైటిల్
ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో విజేత స్పీల్బెర్గ్ (ఆస్ట్రియా): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ఈ ఏడాది రెండో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫార్ములావన్ సీజన్లో భాగంగా ఆదివారం జరి గిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసులో బొటాస్ 71 ల్యాప్‌లను గంటా 21 నిమిషాల 48.527 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన బొటాస్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. ఈ సీజన్లోనే రష్యా గ్రాండ్‌ప్రిలోనూ బొటాస్ విజేతగా నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ వెటెల్‌కు రెండో స్థానం, రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానం, హామిల్టన్ (మెర్సిడెస్) నాలుగో స్థానం పొందారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఏడో స్థానంలో, ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఈనెల 16న జరుగుతుంది. -
బొటాస్‌కు తొలి ‘పోల్ పొజిషన్’
నేడు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి మనామా: అందరి అంచనాలను తారుమారు చేస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 28.769 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 14వ, 18వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్స్: 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. రికియార్డో (రెడ్‌బుల్), 5. రైకోనెన్ (ఫెరారీ), 6. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 7. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 8. మసా (విలియమ్స్), 9. గ్రోస్యెన్ (హాస్), 10. పాల్మెర్ (రెనౌ), 11. క్వియాట్ (ఎస్టీఆర్), 12. లాన్స్ స్ట్రోల్ (విలియమ్స్), 13. వెర్లీన్ (సాబెర్), 14. ఒకాన్ (ఫోర్స్ ఇండియా), 15. అలోన్సో (మెక్లారెన్), 16. సెయింజ్ (ఎస్టీఆర్), 17. వాన్డూర్నీ (మెక్లారెన్), 18. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 19. ఎరిక్సన్ (సాబెర్), 20. మాగ్నుసెన్ (హాస్).