సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): మరోసారి మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు తమ సత్తా చాటుకున్నారు. వరుసగా ఐదో రేసులోనూ ‘పోల్ పొజిషన్’ను సాధించారు. శనివారం జరిగిన ఫార్ములావన్ (ఎఫ్1) 70వ వార్షికోత్సవ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ‘పోల్ పొజిషన్’ దక్కించుకున్నాడు. బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 25.154 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి... ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. రేసింగ్ పాయింట్ జట్టు సబ్‌స్టిట్యూట్ డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ మూడో స్థానంలో నిలువడం విశేషం.
రేసింగ్ పాయింట్ రెగ్యులర్ డ్రైవర్ సెర్గియో పెరెజ్‌కు కరోనా సోకడంతో హుల్కెన్‌బర్గ్‌కు అవకాశం దక్కింది. గత ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో హుల్కెన్‌బర్గ్ పాల్గొన్నా ప్రధాన రేసు మొదలయ్యే సమయానికి కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో అతను ట్రాక్‌పైకి రాకుండానే వైదొలిగాడు. తన కెరీర్‌లో 177 రేసుల్లో పాల్గొన్న హుల్కెన్‌బర్గ్ ఏనాడూ టాప్–3లో నిలువలేకపోయాడు. ఎఫ్1 మొదలై ఏడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఎఫ్1 తొలి రేసు వేదిక సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో ఈ రేసును నిర్వహిస్తున్నారు. ఈ సీజన్‌లో తొలి రేసులో బొటాస్ ‘పోల్’ పొందగా... మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ తర్వాతి మూడు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించాడు.
నేటి ప్రధాన రేసు గ్రిడ్ పొజిషన్స్: 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. నికో హుల్కెన్‌బర్గ్ (రేసింగ్ పాయింట్), 4. మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 5. రికియార్డో (రెనౌ), 6. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 7. పియరీ గాస్లే (అల్ఫా టౌరి), 8. చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ), 9. అలెగ్జాండర్ అల్బోన్ (రెడ్‌బుల్), 10. లాండో నోరిస్ (మెక్‌లారెన్), 11. ఎస్తెబన్ ఒకాన్ (రెనౌ), 12. వెటెల్ (ఫెరారీ), 13. కార్లోస్ సెయింజ్ (మెక్‌లారెన్), 14. గ్రోస్యెన్ (హాస్), 15. జార్జి రసెల్ (విలియమ్స్), 16. డానిల్ క్వియాట్ (అల్ఫా టౌరి), 17. మాగ్నుసెన్ (హాస్), 18. నికోలస్ లతీఫి (విలియమ్స్), 19. గియోవినాజి (అల్ఫా రోమియో), 20. రైకోనెన్ (అల్ఫా రోమియో).
Comments
Please login to add a commentAdd a comment