జొహన్నెస్‌బర్గ్: సీనియర్లు దూరమై ఇప్పటికే దిక్కు తోచని స్థితిలో కనిపిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మరో దెబ్బ తగిలింది. స్టెయిన్, మోర్నీ మోర్కెల్ దూరమయ్యాక పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తున్న సీనియర్ వెర్నాన్ ఫిలాండర్ కూడా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ తర్వాత అతను రిటైర్ కానున్నాడు. తొలి టి20 ప్రపంచకప్‌తో పాటు 30 వన్డేలు కూడా ఆడినా... టెస్టు స్పెషలిస్ట్‌గానే ఫిలాండర్‌కు ఎక్కువ గుర్తింపు దక్కింది.
12 ఏళ్ల కెరీర్‌లో ఫిలాండర్ 60 టెస్టుల్లో 22.16 సగటుతో 216 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 13 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. సఫారీ జట్టు చిరస్మరణీయ టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్వింగ్ బౌలర్, ఆ దేశం తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇటీవల తరచూ గాయాలబారిన పడుతుండటంతో 34 ఏళ్ల ఫిలాండర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత 18 నెలల్లో ఫిలాండర్ 6 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. కొన్నాళ్ల క్రితమే అతని ఫిట్‌నెస్‌ను మాజీ కెప్టెన్, ప్రస్తుతం దక్షిణాఫ్రికా బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రశ్నించడంతో ఫిలాండర్ కెరీర్‌పై చర్చ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment