మోంట్రియల్: వరుసగా నాలుగు రేసుల్లో టైటిల్‌కు దూరంగా నిలిచిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మళ్లీ విజయాల ట్రాక్‌లోకి వచ్చాడు. ఫార్ములావన్ సీజన్‌లో భాగంగా జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రేసులో వెటెల్ 68 ల్యాప్‌లను గంటా 28 నిమిషాల 31.377 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ కెరీర్‌లో ఇది 50వ విజయంకాగా, ఈ సీజన్‌లో మూడోది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. గత మూడేళ్లుగా ఈ రేసులో ‘పోల్ పొజిషన్’ సాధించడంతోపాటు విజేతగా నిలిచిన హామిల్టన్ (మెర్సిడెస్) ఈసారి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), రికియార్డో (రెడ్‌బుల్) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. 2004 తర్వాత కెనడా గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్‌కు టైటిల్ దక్కడం ఇదే తొలిసారి. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఎస్టెబన్ ఒకాన్ తొమ్మిదో స్థానంలో, సెర్గియో పెరెజ్ 14వ స్థానంలో నిలిచారు. మరోవైపు రేసు ముగింపునకు సూచికగా చెకర్డ్ ఫ్లాగ్‌ను చివరిదైన 70 ల్యాప్‌నకు బదులుగా 68వ ల్యాప్‌లోనే మోడల్ విన్నీ హార్లో ఊపడంతో గందరగోళం చోటు చేసుకుంది. సీజన్‌లో ఏడు రేసులు ముగిశాక వెటెల్ 121 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పట్టికలో మళ్లీ టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. 120 పాయింట్లతో హామిల్టన్ రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది.
వెటెల్ ఖాతాలో 50వ టైటిల్
Published Tue, Jun 12 2018 12:52 AM | Last Updated on Tue, Jun 12 2018 12:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment