
పృథ్వీ షా, సతీశ్ గణేశ్, వినయ్
మూలపాడు (విజయవాడ): మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సతీశ్ గణేశ్ (397 బంతుల్లో 237; 25 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత డబుల్ సెంచరీ చేయడంతో... ఆంధ్ర జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 268/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు 147.3 ఓవర్లలో 441 పరుగులకు ఆలౌటైంది. 230 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్ ఐదు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది.
వినయ్ ఖాతాలో 400 వికెట్లు...
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో భాగంగా బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో పుదుచ్చేరి జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. పుదుచ్చేరికి ఆడుతున్న భారత జట్టు మాజీ బౌలర్, కర్ణాటకకు చెందిన వినయ్ కుమార్ ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయడంద్వారా రంజీల్లో 400 వికెట్లు పడగొట్టిన రెండో పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. పంకజ్ సింగ్ (409 వికెట్లు) మాత్రమే వినయ్‌కంటే ముందున్నాడు. ఓవరాల్‌గా రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజిందర్ గోయల్ (637 వికెట్లు) పేరిట ఉంది.
పృథ్వీ షా డబుల్ సెంచరీ...
డోపింగ్ నిషేధం పూర్తయ్యాక పునరాగమనంలో ముంబై యువ ఆటగాడు పృథ్వీ షా అదరగొడుతున్నాడు. బరోడాతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లోపృథ్వీ షా (179 బంతుల్లో 202; 19 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెండో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ఫలితంగా ముంబై రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 409 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. బరోడాకు 534 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
Comments
Please login to add a commentAdd a comment