![Nair Dube Stars As Vidarbha Thrash Tamil Nadu Enter Ranji Trophy Semis](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/karun.jpg.webp?itok=God-w1T7)
రంజీ ట్రోఫీ 2024-25(Ranji Trophy)లో విదర్భ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్-2లో తమిళనాడుతో తలపడ్డ విదర్భ భారీ విజయం సాధించింది. నాగ్‌పూర్‌లో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఏకంగా 198 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
కరుణ్ నాయర్ శతకం
కాగా సొంత మైదానం విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో శనివారం టాస్ గెలిచిన అక్షయ్ వాడ్కర్ బృందం తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు అథర్వ టైడే(0), ధ్రువ్ షోరే(26)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య ఠాక్రే(5) ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మిడిలార్డర్‌లో డానిశ్ మాలేవర్(75) అర్ధ శతకంతో రాణించగా.. కరుణ్ నాయర్(Karun Nair) శతక్కొట్టాడు.
హర్ష్ దూబే హాఫ్ సెంచరీ
మొత్తంగా 243 బంతులు ఎదుర్కొన్న కరుణ్ 122 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడుగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే(Harsh Dube) హాఫ్ సెంచరీ(69)తో మెరిశాడు. ఈ క్రమంలో విదర్భ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ మూడేసి వికెట్లు దక్కించుకోగా.. మొహమ్మద్ రెండు, అజిత్ రామ్, మొహమద్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
తమిళనాడు బ్యాటర్లు విఫలం
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు మొహమద్ అలీ(4), నారాయణ్ జగదీశన్(22)తో పాటు.. సాయి సుదర్శన్(7), బూపతి కుమార్(0) విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆండ్రీ సిద్దార్థ్(65) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హర్ష్ దూబే అతడిని పెవిలియన్‌కు పంపాడు.
మిగతావాళ్లలో ప్రదోష్ పాల్(48), సోనూ యాదవ్(32) మాత్రం ఫర్వాలేదనిపించగా.. తమిళనాడు 225 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. విదర్భ బౌలర్లలో ఆదిత్య ఠాక్రే ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్, నచికేత్ భూటే రెండేసి వికెట్లు, హర్ష్ దూబే ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
కెప్టెన్ రాణించినా..
ఈ క్రమంలో 128 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విదర్భ 272 పరుగులకు ఆలౌట్ అయింది. ఈసారి యశ్ రాథోడ్(112) శతకంతో చెలరేగగా.. హర్ష్ దూబే మరోసారి హాఫ్ సెంచరీ(64) సాధించాడు. ఇక తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయి కిషోర్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
అనంతరం 401 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు.. మంగళవారం నాటి ఆటలో భాగంగా 202 పరుగులకే కుప్పకూలింది. ప్రదోష్ పాల్(53), సోనూ యాదవ్(57) అర్ధ శతకాలతో రాణించగా.. మిగతా వాళ్లంతా కనీసం ఇరవై పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు.
విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే, నచికేత్ భూటే మూడేసి వికెట్లతో చెలరేగి తమిళనాడు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. మరోవైపు ఆదిత్య ఠాక్రే, అక్షయ్ వాఖరే చెరో వికెట్ తీశారు.
సెమీస్ పోరులో ముంబైతో
ఈ నేపథ్యంలో 198 పరుగులతో తమిళనాడును చిత్తుచేసిన విదర్భ సెమీస్ చేరుకుంది. శతక వీరుడు కరుణ్ నాయర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ సీజన్‌లో విదర్భ ఇప్పటికి ఎనిమిదింట ఏడు విజయాలు సాధించడం విశేషం.
ఇక విదర్భ ఫైనల్ బెర్తు కోసం ముంబైతో తలపడుతుంది. మరోవైపు.. సౌరాష్ట్రపై గెలుపొందిన గుజరాత్ కూడా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. జమ్మూ కశ్మీర్- కేరళ జట్ల మధ్య మ్యాచ్‌లో విజేతతో గుజరాత్ అమీతుమీ తేల్చుకుంటుంది.
చదవండి: శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్‌లో ముంబై
119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్ ఘనత
Comments
Please login to add a commentAdd a comment