సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అండర్–23 పురుషుల వన్డే లీగ్ అండ్ నాకౌట్ చాంపియన్‌షిప్‌లో విదర్భ జట్టు విజేతగా నిలిచింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో విదర్భ 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించి టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ లలిత్ యాదవ్ (82 బంతుల్లో 65; 6 ఫోర్లు, 1 సిక్స్), సుమిత్ మాథుర్ (65 బంతుల్లో 52; 4 ఫోర్లు) అర్ధసెంచరీలతో జట్టు సాధారణ స్కోరును సాధించగలిగింది. విదర్భ బౌలర్లలో పీఆర్ రేఖడే 4 వికెట్లు దక్కించుకోగా... ఎన్ ఎస్ పరండే 2 వికెట్లు తీశాడు. అనంతరం విదర్భ జట్టు 48.2 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసి గెలుపొందింది. పవన్ పర్నాటే (132 బంతుల్లో 88 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. నయన్ చవాన్ (48; 4 ఫోర్లు) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా... అభిషేక్ వత్స్, యోగేశ్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.
రాణించిన లలిత్, సుమిత్
గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కున్వర్ బిధురీ (4) ఫైనల్లో రాణించలేకపోయాడు. మరో ఓపెనర్ ఆయుశ్ బదోని (15), వికాస్ దీక్షిత్ (2) కూడా త్వరగానే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లలిత్ యాదవ్... వైభవ్ కందపాల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు)తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఈ జంట నాలుగో వికెట్‌కు 40 పరుగుల్ని జోడించిన తర్వాత వైభవ్ ఔటయ్యాడు. కొద్దిసేపటికే లక్ష్య్ (10) పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 115 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత లలిత్‌కు జత కూడిన సుమిత్ మాథుర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. లలిత్ ఔటైనా... మిగతా బ్యాట్స్‌మెన్ తో కలిసి సుమిత్ పరుగుల్ని జోడించాడు.
పవన్ అర్ధసెంచరీ
సాధారణ లక్ష్యఛేదనలో విదర్భకు శుభారంభం దక్కలేదు. 25 పరుగులకే ఓపెనర్లిద్దరినీ జట్టు కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పవన్ పర్నాటే, నయన్ చవాన్ ఇద్దరూ బాధ్యతగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 103 పరుగుల్ని జోడించాక నయన్ చవాన్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్‌ఎంఆర్ కాలే (29; 3 ఫోర్లు), దర్శన్ నల్కండే (24 నాటౌట్) అండతో పవన్ మిగతా పని పూర్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment