42వసారి టైటిల్ సొంతం
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ విజేత
ఫైనల్లో 169 పరుగులతో విదర్భపై ఘన విజయం
విదర్భ ఇన్నింగ్స్‌లో 135వ ఓవర్... అప్పటికే 9 వికెట్లు పడ్డాయి... కెరీర్‌లో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ముంబై పేసర్ ధవల్ కులకర్ణి ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లే వేశాడు... ఒక్కసారిగా ధవల్ చేతికి కెప్టెన్ రహానే బంతిని అందించాడు... మూడో బంతికి ఉమేశ్ యాదవ్ క్లీన్‌బౌల్డ్... ముంబై శిబిరంలో సంబరాలు షురూ... వెరసి దేశవాళీ క్రికెట్ దిగ్గజం ఖాతాలో మరో రంజీ ట్రోఫీ చేరింది.
ముంబై జట్టు ఏకంగా 42వ సారి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టీమ్ ఖాతాలో మరో కప్ చేరగా... ధవల్ ఐదో రంజీ విజయంలో భాగంగా నిలిచి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలికాడు.
ముంబై: భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని ముంబై జట్టు సొంతం చేసుకుంది. గురువారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో రెండుసార్లు చాంపియన్ విదర్భపై ఘన విజయం సాధించింది. విదర్భ చివరి రోజు వరకు పోరాడినా అసాధ్యమైన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. 538 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 248/5తో ఆట కొనసాగించిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (199 బంతుల్లో 102; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా... హర్‡్ష దూబే (128 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. అక్షయ్, హర్‡్ష చాలాసేపు ముంబై బౌలర్లకు లొంగకుండా ఇబ్బంది పెట్టారు. అయితే ఎట్టకేలకు తనుష్ బౌలింగ్‌లో అక్షయ్ వికెట్ల ముందు దొరికిపోవడంతో ముంబై గెలుపు బాట పట్టింది. మిగిలిన నాలుగు వికెట్లను 15 పరుగుల వ్యవధిలోనే తీసి ముంబై చాంపియన్‌గా అవతరించింది.
సెంచరీ సాధించడంతో పాటు 2 వికెట్లు తీసిన ముషీర్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతనికి రూ. 50 వేలు ప్రైజ్‌మనీ దక్కింది. టోర్నీ మొత్తంలో 502 పరుగులు, 29 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన ముంబై ఆటగాడు తనుష్ కొటియన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. తనుష్ కు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్‌మనీ లభించింది. 1934–35 సీజన్‌లో తొలిసారి విజేతగా నిలిచిన ముంబై (బాంబే) జట్టు ఈ టైటిల్‌కు ముందు 2015–16 సీజన్‌లో చివరిసారి ట్రోఫీని అందుకుంది.
ఆటగాళ్లపై కోట్లాభిషేకం...
ప్రైజ్‌మనీలో ముంబై డబుల్ ధమాకా కొట్టింది. సీజన్ విజేతకు బీసీసీఐ రూ. 5 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వగా... ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెటర్లకు ప్రత్యేకంగా రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.
దీంతో తాజా రంజీ విజేతకు వచ్చిన ప్రైజ్‌మనీ రెట్టింపైంది. ‘ఈ సీజన్‌లో మా జట్లు బాగా ఆడాయి. బీసీసీఐ నిర్వహించిన వయో విభాగాల టోర్నీలన్నింటిలోనూ ఫైనల్ చేరాయి. దీంతో ఎంసీఏ ప్రోత్సాహకంగా రూ. 5 కోట్ల బహుమతి ఇస్తోంది’ అని కార్యదర్శి అజింక్య నాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment