
సిడ్నీ: ఆరంగేట్రంతోనే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుని టీమిండియా భవిష్యత్తు ఆశా కిరణంగా పృథ్వీ షా కనిపించిన విషయం తెలిసిందే. ఇక తొలి మ్యాచ్‌లోనే అనుభవమున్న ఆటగాడిగా కచ్చితమైన షాట్‌లతో, అద్భుతమైన టైమింగ్‌తో షా ఆకట్టుకున్నాడు. దీంతో ఈ యంగ్ ప్లేయర్‌ను అభిమానులు, క్రీడా విశ్లేషకులు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వగ్, ఎంఎస్ ధోనిలతో పొల్చడం మొదలెట్టేశారు. తన ప్రతిభతో కీలక ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తలపడబోయే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. తొలి సారి ఆసీస్ పర్యటనకు వచ్చిన షాకు నమ్మశక్యంకాని అనుభవం ఎదురైంది.
క్రికెట్‌లో టీమిండియా స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవిదేశాల్లో టీమిండియా క్రికెటర్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇంకా పట్టుమని పది మ్యాచ్‌లు కూడా ఆడని షాకు ఆసీస్‌లోని ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మైదానం బయట పృథ్వీషాతో సెల్ఫీలు దిగడానికి ఫ్యాన్స్ పోటీపడ్డారు. అయితే అభిమానులను నిరుత్సాహపరచకుండా ఓపికగా సెల్ఫీలు దిగి వారందరినీ ఆనందపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆసీస్‌లో షా క్రేజ్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment